పీకే.. బహుజనవాదంలో నిజాయతీ లేదా?
Published on: Fri Sep 3, 2021 9:53AM
మనసులో ఉండేది ఒకటి.. మాట్లాడేది మరొకటి. ఫక్తు రాజకీయ నాయకులు బాగా ఒంట పట్టించుకున్న రాజకీయ సూత్రం ఇదే. అయితే ఈ వైఖరి నడిచినంత కాలం నడుస్తుంది. ఆ తరువాత కూడా నడవడం అంటే అది జరిగేపని కాదు. ఎన్నో పార్టీలు పెట్టిన ఎందరో నాయకులు ఒక తుఫానులా వచ్చి ఆ తరువాత పిల్లగాలి కూడా కాలేకపోయారు. అందుక్కారణం వారు మాట్లాడే మాటల్లో నిజాయతీ లేకపోవడమేనంటున్నారు సామాజికవేత్తలు. ప్రజలకు అసలు విషయం తెలిసిన తరువాత అలాంటి రాజకీయ నాయకులను ప్రజలే పక్కన పెట్టేస్తారు. అయితే ఇవే అనుమానాలు బహుజన రాజ్యం తెస్తానంటున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ కూడా ముసురుకుంటున్నాయి. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు, సర్కారు వైఫల్యాలు, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానాలు.. ఇలా అనేక కారణాల వల్ల పీకే బహిరంగ సభలకు భారీ స్పందన వస్తుందే తప్ప... ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వం వల్ల కానీ, మెజార్టీ ప్రజాశ్రేణుల్లో ఉన్న సెంటిమెంట్లను గౌరవించినందు వల్ల కానీ ఆయన మాటలకు మైలేజీ రావడం లేదన్న అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ప్రజాక్షేత్రంలో రాణించాలంటే ఒకరి బలహీనత మీద కాకుండా స్వీయ బలాలపైనే నిలబడి గెలవాల్సి ఉంటుందని, ఆ బలమే పది కాలాలపాటు ప్రజల్లో నాయకుడిగా నిలబెడుతుందన్న వ్యాఖ్యానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఇందుకు పీకే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో ఏనాడు కూడా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆయన చేతిలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న చాలా మంది బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు బహుజనవాదం వినిపిస్తున్న పీకే... తాను కీలకమైన పోస్టులో ఉన్నప్పుడు ఎంతమంది బీసీ విద్యార్థులకు సీటిచ్చి మేలు చేశాడో చెప్పాలన్న బహిరంగ విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. స్వల్పంగా ఉన్న ఓపెన్ కోటాలో కూడా ఎస్సీలకు అందులోనూ మాదిగలకు తప్ప మరో సామాజికవర్గాన్ని ఎప్పుడూ చేరదీయలేదని పలువురు బీసీ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో వివిధ రకాల వస్తువులు సమకూర్చే కాంట్రాక్టులు కూడా స్వేరో సంస్థ సభ్యులకే ఇచ్చారని, ఎప్పుడూ దీనిమీద బహిరంగ కొటేషన్లు కోరలేదని.. గతంలో కాంట్రాక్టు కోసం ప్రయత్నించి విఫలమైన కొందరు బీసీలు, ఎస్సీల్లోని మాలలు స్వయంగా చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనారిటీల ఐక్యత అంటున్న పీకే.. ఎస్సీ మాదిగలు మినహా ఏ ఒక్క సామాజికవర్గానికి కూడా గురుకులాల నుంచి కాంట్రాక్టులు అందలేని వారు పాతరోజులు గుర్తు చేసుకుంటున్నారు.
అంతేకాదు.. ఇప్పుడు నుదుటికి బొట్టు పెట్టుకొని నీలిరంగు కండువాలతో యువతతో ర్యాలీలు తీస్తున్న పీకే... గత మార్చిలో చేసిన వివాదాస్పద ప్రతిజ్ఞను వారిప్పుడు గుర్తు చేస్తున్నారు. హిందూ దేవీ-దేవతలను ఎప్పుడూ కొలిచేది లేదని ఒక సమావేశంలో ప్రతిజ్ఞ చేయించిన పీకే.. తన మీద వచ్చిన విమర్శలకు జడిసే పోచమ్మ, ఎల్లమ్మ గుళ్లకు వెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని అసలు విషయం చెబుతున్నారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వేసే చిల్లర గిమ్మిక్కులే ఉన్నతమైన చదువులు చదువుకున్న పీకే కూడా చేస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వెల్లువెత్తుతున్నాయి. తాను గురుకుల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఎస్సీ-మాదిగల కోసమే తప్ప ఏనాడూ బీసీలకు మేలు చేయలేదని, అంతేగాక.. బీసీలెప్పుడూ ఐక్యంగా ఉండరని, వారు అగ్రవర్ణాల అడుగుజాడల్లోనే నడుస్తారు తప్ప ఎస్సీల సమస్యల పట్ల వారెప్పుడూ సానుకూలంగా స్పందించరని, అలాంటివారిని తాము ప్రోత్సహించాల్సిన అవసరం లేదని అనేవారని గుర్తు చేస్తున్నారు.
అలాంటి పీకే ఇప్పుడు హఠాత్తుగా ఎస్సీ, బీసీ, ఎస్టీ ల అభివృద్ధి అంటూ ఐక్యతారాగం తీస్తే అందులో చిత్తశుద్ధి ఎంతుందో కచ్చితంగా అనుమానాలు కలుగుతున్నాయన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా వడ్రంగి పనిచేసుకునే ఓ కార్మికుడితో మాటామాటాల కలిపారు. వృత్తిపనిలో తమకు ఎన్నో ప్రమాదాలు ఎదురవుతున్నాయని, కట్టెకోత మిషన్లలో, దూగోడ మిషన్లలో వేళ్లు, చేతులు కోల్పోయిన జీవచ్ఛవాలుగా బతుకుతున్న ఎందరో వడ్రంగులు ఉన్నారని, అలాంటివారిని కూడా ఈ సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని పీకే దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వేలు కట్టయిన ఫొటోను హైలైట్ చేసిన పీకే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే పీకే తీసుకున్న తాజా వైఖరిలో చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని, ఎస్సీలతో సమానంగా ఆర్థికపరమైన స్వాతంత్య్రం కోసం పనిచేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అలాగే హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నికలో కూడా ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్.కృష్ణయ్యతో భేటీలో చాలా కీలకమైన చర్చే జరిగిందన్న వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఇప్పటివరకూ అసలు మనిషిని దాచిపెట్టిన పీకే.. ఇకపై ఆ మనిషిని బయటకు చాటుకోక తప్పదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


