రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
Published on: Thu Feb 3, 2022 12:14PM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ (కేరళ) ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా విదేశాంగ విధానం గురించి రాహుల్ గాంధీ చేసిన సంచలన వాఖ్యలు విమర్శలు, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ చర్చనీయాంశ మయ్యాయి. కలకలం సృష్టిస్తున్నాయి.
రాహుల్ గాంధీ తమ 40 నిముషాల ప్రసంగాన్ని మూడు భాగాలుగా విభజించి, ఏ అంశానికి ఆ అంశాన్ని చక్కగా వివరించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తడబాట్లు,పొరపాట్లు, కౌగిలింతలు, కన్నుగీటులు లేకుండా హుందాగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని, స్పష్టంగా చెప్పారు. మెచ్యూరిటీ చూపించారు. అంతవరకు బాగున్నా, ఆయన ప్రస్తావించిన విషయం, ముఖ్యంగా విదేశాంగ విధానానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాహుల గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంలోని, లోపాల వల్లనే, పాకిస్థాన్, చైనా దగ్గరయ్యాయని అన్నారు.ఆరోపించారు.మోడీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద నేరం ఇదే అని, రాహుల్ సూత్రీకరించారు. అంతే కాదు,కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విదేశాంగ నీతిని వివరించే ప్రయత్నం చేశారు.శతృవులు ఎప్పుడూ ఏకీకృతం కాకుండా ఉండాలనేది భారత విదేశాంగ విధానం మూలసూత్రమని అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మూలా సూత్రాన్ని ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రత్యేకించి- పాకిస్తాన్.. చైనాలను ఎప్పుడూ వేరుగా ఉంచాలనేది వ్యూహాత్మక విదేశాంగ విధానమని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ రెండు దేశాలు దగ్గరయ్యాయని, మోడీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం ఇదేనని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. ఆ దేశాలను తక్కువగా అంచనా వేయొద్దని హితవు పలికారు.
అదే క్రమంలో ఎప్పటిలానే రాహుల గాంధీ, చైనా శక్తి సామర్ధ్యాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఆ దేశానికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. డోక్లాం, లద్దాఖ్‌లలో చైనా తమ ప్రణాళికను అమలుచేసిందని అన్నారు. భారతదేశానికి ఇది చాలా తీవ్రమైన ముప్పులాంటిందని పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో మనం చాలా పెద్ద పొరపాటు చేశామంటూ రాహుల్ గాంధీ ముక్తాయింపు నిచ్చారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు, విమర్శలను కేంద్ర మంత్రులు, బీజీపీ నాయకులు గట్టిగానే తిప్పి కొట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో ఏమి జరిగిందో వివరిస్తూ ఎదురు దాడి చేశారు.
అదలా ఉంటే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించట్లేదని అమెరికా స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చైనా-పాకిస్తాన్ ఇదివరకెప్పుడూ లేనివిధంగా చేరువ అయ్యాయనే వ్యాఖ్యలు సహేతుకం కాదని తాము భావిస్తున్నామని అన్నారు. చైనా- పాకిస్తాన్ చేరువ అయ్యాయనే వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నామని, దీన్ని సమర్థించట్లేదని తేల్చి చెప్పారు. దీనిపై చైనా, పాకిస్తాన్ కూడా స్పందించాల్సి ఉంటుందని నెడ్ ప్రైస్ చెప్పారు. అదలా ఉంటే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే సమయంలో ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో చూడవలసి ఉందని అంటున్నారు.


