బుజ్జగించిన సీఎం..ససేమిరా అన్న సత్యవతి
Published on: Tue Feb 7, 2012 9:08AM
హైద
రాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తిట్టిన వారికే విస్తరణలో మంత్రి పదవులిచ్చారని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఏకైక బిసి మహిళనైన తనను ఏ కారణంతో పక్కన పెట్టారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బిసి మహిళ కొండా సురేఖకు మంత్రి పదవిచ్చారనీ, ఆమె రాజీనామా తర్వాత ఇంతవరకూ ఆ స్థానాన్ని అధిష్టానం భర్తీ చేయలేదనీ విమర్శించారు. విస్తరణలో బిసిలకు తీవ్ర అన్యాయం చేశారనీ, కార్యకర్తలతో చర్చించాక తాను రాజీనామా చేస్తాననీ వెల్లడించారు. ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. తగిన గుర్తింపు లభిస్తుందని, కాస్త సహనం వహించాలని ఆయన ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కకపోవడంతో పాటు తమ జిల్లాకు చెందిన కొండ్రు మురళికి దక్కడంపై ఆమె తీవ్రంగా మండిపడుతున్నారు. తాను సీనియర్ శాసనసభ్యురాలినని, అయినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. రాజీనామా చేసేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆమె అన్నారు.


