రోజాకేమైంది.. ఆ ట్వీట్ వెనుక అర్దమేంటి?
Published on: Sun Mar 2, 2025 8:55AM

మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆమె మాటలూ, చేష్టలూ అన్నీ సంచలనమే. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రోజా ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ గూటికి అక్కడ నుంచి వైసీపీకి మారారు. వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రోజా, జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే వ్యాఖ్యలు, ఆమె ఉపయోగించే భాష కారణంగా ఆమె తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. అటువంటి రోజా తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలను రేకెత్తించేలా ఆమె ట్వీట్ ఉంది. జగన్ ఆమెకు చేయిచ్చి నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గిరీ నుంచి పీకేయనున్నారా అన్న చర్చకు తెరలేపింది. సాయం చేస్తే మరిచిపోతారు.. చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు.. అందుకే ఈ హెల్ప్ అనేది చాలా విచిత్రమైనది అంటూ రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అదే సమయంలో నెటిజనులు రోజాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి కూడా కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆర్కే రోజా.. అంతలోనే బేలగా సాయం చేస్తే మరిచిపోతారు.. చేయక పోతే గుర్తుంచుకుంటారు అంటే చేఃసిన ట్వీట్.. వైసీపీలో ఆమె స్థాయి తగ్గించేశారా అన్న అనుమానాలకు తెర తీసింది. నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా రోజా స్థానంలో గాలి జగదీష్ ను తీసుకురానున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పేశారనీ, ఆ కారణంగానే రోజా ఒక విధమైన నైరాశ్యంలో తాను వైసీపీకి ఎంత హెల్ప్ చేశానో అన్యాపదేశంగా గుర్తు చేస్తూ దానిని జగన్ మరచిపోయారన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవడమంటే రోజాకు పొమ్మన లేక పొగపెట్టడమేనని అంటున్నారు.
అసలు 2024 ఎన్నికలలోనే రోజాకు నగరి టికెట్ ఇచ్చే ఉద్దేశం జగన్ కు లేదన్న వార్తలు బలంగా వినిపించాయి. వరుసగా రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించినప్పటికీ.. పార్టీలోనే కాకుండా నియోజకవర్గ ప్రజలలో కూడా ఆమెపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత గూడు కట్టుకుందని భావించిన జగన్ ఆమెకు టికెట్ నిరాకరించాలని భావించారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రోజా నోటికి జడిశారో ఏమో జగన్ అయిష్టంగానే రోజాను మళ్ళ నగరి నుంచి పోటీకి దింపారు. ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి ఇప్పుడు ఇక రోజాను వదిలించేసుకోవడమే లక్ష్యంగా జగన్ గాలి జగదీష్ ను రంగంలోకి దింపుతున్నారు. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడే గాలి జగదీష్. ఆయన మరో కుమారుడు గాలి భాను ప్రకాశ్ నగరి ఎమ్మెల్యే. 2024 ఎన్నికలలో గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థిగా రోజాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుని నగరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రోజాను వదిలించుకోవడంతో పాటు.. తెలుగుదేశం బలాన్నీ దెబ్బతీయవచ్చన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా ఒక విధమైన వైరాగ్యంలో హెల్ప్ ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు.


