TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గని రోజా నోటి దురుసు.. మహిళ నోటి వెంట ఇలాంటి మాటలా?

Published on: Thu Apr 17, 2025 3:36PM

మాజీ మంత్రి రోజా మరో సారి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన రోజా ఈ రోజు తిరుపతిలో తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. గోశాలలో గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై టీటీడీ సవాల్ ను స్వీకరించిన భూమన గోశాలను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా భూమన తన నివాసం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని కేవలం తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రం తీసుకుని గోశాలకు వెళ్లాలని సూచించారు. అయితే అందుకు నిరాకరించిన భూమన తన నివాసం వద్దే రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా అక్కడకు చేరుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. సవాల్ చేసి పారిపోయారంటూ తెలుగుదేశం వారిని ఉద్దేశించి  ఆడంగి వెధవలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు మొత్తంగా మహిళా లోకాన్నే కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.

గతంలో అమరావతి రైతుల ఉద్యమంపై కూడా ఇలానే మహిళలను కింపరిచేలా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం వారు ఆడవాళ్లను ముందు పెట్టి అందోళనలు చేస్తున్నారంటూ ఆడింగి వెధవలు అన్న మాట ఉపయోగించారు. అలాగే ఒక సందర్భంగా నారా లోకేష్ కు చీర, గాజులు పంపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒక మహిళ అయి ఉండి కూడా ఆడవారి పట్ల కించిత్ గౌరవం కూడా లేకుండా రోజా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు.