రోజా ఇన్.. పెద్దిరెడ్డి అవుట్.. జగన్ లెక్క ఇదేనా?
Published on: Wed Mar 30, 2022 12:28PM
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను కేబినెట్‌లోకి తీసుకుని.. కీలక మంత్రి పదవి అప్పగించాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ఆమెకు సీఎం జగన్ స్వయంగా చెప్పినట్లు సమాచారం. దీంతో తాను మంత్రి కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా రోజాకు .. ఆ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉండడంతో.. ఆమె గుళ్లు గోపురాలు చుట్టేస్తున్నట్లు ఓ టాక్ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. మరోవైపు... మంత్రి అయితే ఇక బిజీ బిజీ క్షణం తీరిక ఉండదు. అదీకాక.. మంత్రి పదవుల్లో ఉన్నవారు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే ఓ నిబంధన ఉన్నట్లు సమాచారం.
ఆ క్రమంలో బుల్లితెరలో వెలువడుతున్న.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా.. ఇతర కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికి రోజా... టా.. టా.. బై.. బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే.. బుల్లి తెరపై వచ్చే పలు కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్న వారి ఎంపిక ప్రక్రియను ఇప్పటికే రోజా ఆధ్వర్యంలో పూర్తి చేసి.. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రోజా నిమగ్నమైనట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా సాక్షిగా తెగ రచ్చ రచ్చ అవుతోంది. అదీకాక.. రానున్నది ఎన్నికల సీజన్. ఈ నేపథ్యంలో మళ్లీ ఫ్యాన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడాలంటే.. మహిళా ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో తీసుకోవాలని జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అ క్రమంలో పార్టీలోని మహిళా ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఈ సారి మంత్రి పదవి దక్కుతోందనే ఓ చర్చ ఒకటి సాగుతోంది.
మరోవైపు ఆర్కే రోజాకు సొంత జిల్లాలో ప్రధాన ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేబినెట్ నుంచి తప్పించాలని జగన్ భావిస్తున్నారట. అయితే మంత్రి పెద్దిరెడ్డి.. సూపర్ సీనియర్ నాయకుడు.. ఆయన గతంలోనే కర్నూలు, అనంతపురం జిల్లాల ఇన్ ఛార్జ్‌గా పని చేస్తే.. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు దాదాపు 50 మందికిపైగా ఎమ్మెల్యేలతోపాటు 15 మందికిపైగా ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అదీకాక రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఈ పెద్దాయన సేవలను ఉపయోగించుకోవాలని ఇఫ్పటికే.. పలువురు ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు.. సీఎం జగన్‌కూ సూచించినట్లు తెలుస్తోంది.
అదీకాక.. ఆర్కే రోజాకు.. పెద్దిరెడ్డికి మధ్య వైరం ఉందన్న తెలుగు ప్రజలందరికీ సంగతి తెలిసిందే. ఇంకోవైపు రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాను ఓడించేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా ప్రముఖ నటి వాణి విశ్వనాథ్‌ను ఆమెకు ప్రత్యర్థిగా నిలబెట్టాలనే భావిస్తుందట ఆ పార్టీ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలో పసుపు పార్టీకి చెక్ పెట్టి.. ముచ్చటగా మూడోసారి ఆర్కే రోజా గెలుపు కోసం.. సీఎం జగన్ ఇలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా రోజా మంత్రి గిరి కోట్టేసి.. జబర్దస్త్ షోకు పుల్ స్టాప్ పెట్టేస్త.. ఆమె డైహార్ట్ ఫ్యాన్స్ ఏమైపోతారనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో కొనసాగుతోంది.


