మళ్లీ మేల్కొన్న రోజా.. చంద్రబాబుపై విమర్శలు..

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెషన్ చేసినప్పుడు మాత్రం రోజూ.. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని.. టీడీపీ అధినేతను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రోజా.. ఆతరువాత ఆ వ్యవహారం ముగిసే సరికి చాలా రోజుల నుండి సైలెంట్ గానే ఉన్నారు. మళ్లీ ఇన్ని రోజుల తరువాత మేల్కొని.. చంద్రబాబుపై తన విమర్శల బాణాలు వదిలారు.

 

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అంటూ ముందుకెళ్తుంటే.. చంద్రబాబు మాత్రం సింగపూర్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానా? లేక సింగపూర్‌కు రాజధానా? అని ప్రశ్నించారు. అంతే కాదు స్విస్ ఛాలెండ్ పద్దతిపై కూడా ఆమె మాట్లాడుతూ.. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతున్న అమరావతి దోపిడీని తాము అడ్డుకొని తీరుతామని.. ఏపీని చంద్రబాబు సింగపూర్ దొరల చేతుల్లో పెడుతున్నారని, సింగపూర్‌కు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేసారని విమర్శించారు. బినామీల కోసమే చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించారన్నారు. భూములను బినామీలతో కొనుగోలు చేయించారన్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అడ్డుకుంటామని, త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని రోజా తెలిపారు. మరి రోజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.