రోజాపై చర్యలు తీసుకోండి.. రెండు రోజులు బయటకు రాలేదు.. ఎమ్మెల్యే అనిత
Published on: Tue Dec 22, 2015 2:52PM

వైకాపా ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా గతంలో నా మీద కూడా ఇలానే జుగుప్సాకరంగా మాట్లాడారు.. ఇప్పుడు ఎమ్మెల్యే అనితపై కూడా అలాగే నోరు పారేసుకున్నారని.. ఒక ఎమ్మెల్యేగా తను ఇలా మాట్లాడటం సరికాదని.. రోజాకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. రోజా ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోయి తను ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీలా మాట్లాడుతుందని.. సభలకు వచ్చేది ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి కానీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవడానికి కాదని అన్నారు. అంబేడ్కర్ వల్లే తమ వంటి దళితులం అసెంబ్లీలో అడుగు పెట్టామని, అలాంటి తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రోజాను జగన్ వెనకేసుకురావడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
ఇదిలా ఉండగా రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాయనని.. రెండు రోజులపాటు ఇంటిలోనుండి బయటకు రాలేక పోయానని తీవ్ర మనోవేధనకు గురయ్యానని ఎమ్మెల్యే అనిత అన్నారు. దళిత మహిళనైన తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పైన సరైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనిత విజ్ఞప్తి చేశారు.


