అన్నీ గడ్కరీనే చేస్తే.. మరి, జగనన్న ఏం చేస్తారట?
Published on: Thu Feb 17, 2022 3:58PM
విజయవాడలో భారీ కార్యక్రమం జరిగింది. బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. పనిలో పనిగా, ఏపీలో 740 కిలోమీటర్ల పొడవైన 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీకి నిధుల వరద పారించారు గడ్కరీ. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు.. 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు.. 30 ఆర్వోబీలు.. ఇలా వినసొంపైన ప్రసంగం చేశారు కేంద్ర మంత్రి.
అంతా బాగుంది. చాలా సంతోషం. ఏపీలో నేషనల్ హైవేలు అద్దంలా మెరుస్తాయన్న మాట. రాష్ట్రమంతా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో రానున్నాయన్న మాట. కేంద్ర ప్రాజెక్టులు కాబట్టి.. వాటి క్వాలిటీపై డౌట్ అవసరం లేదు. ఇకపై ఏపీలోని జాతీయ రహదారులపై జాయ్ జాయ్ మంటూ ప్రయాణం చేయొచ్చు. ఇంత వరకూ ఓకే కానీ.. మరి, ఆ హైవే దిగి.. రాష్ట్ర రహదారులపైకి వస్తే ఏంటి పరిస్థితి? ఈ మాట వింటేనే.. ఆ రోడ్లు గుర్తు చేసుకుంటేనే.. గుండె గుబేల్ మంటోంది ఏపీవాసులకి.
అవి రోడ్లా? లేక, ఇంకుడు గుంతలా? అన్నట్టు ఉన్నాయి ఏపీ రహదారులు. కేంద్రం ఆధ్వర్యంలో ఉండే నేషనల్ హైవేల వరకూ బాగున్నాయి కానీ.. స్టేట్ రోడ్స్ మాత్రం అధ్వాన్నంగా తయారయ్యాయి. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలనే తేడా లేకుండా.. ఏ రోడ్డు చూసినా గోతులు, కంకర తేలిన గుంటలే. చెత్త చెత్తగా తయారయ్యాయి రహదారులు. ఆ డొక్కు రోడ్లపై వెళ్లలేక, మరో దారిలేక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. ఆ గతుకుల రోడ్లపై వెళ్తూ వాహనదారుల నడ్డి విరుగుతోంది. బండ్లు పాడవుతున్నాయి. నడుము నొప్పులు వస్తున్నాయి. నడవడానికీ దారుణంగా ఉన్న రోడ్లు ఏపీలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయి.
అందుకే, అప్పట్లో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ రోడ్ల దుస్థితిపై కాస్త పోరాటం చేశారు. స్వయంగా శ్రమదానం కూడా చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎంటరై.. ఇంకాస్త ఎక్కువ పోరాటం చేసింది. దీంతో, సీఎం జగన్ హడావుడిగా రోడ్ల దుస్థితిపై మీటింగ్ పెట్టి.. వెంటనే రిపేర్ చేయించమని, నిధులు కేటాయిస్తామని ఆదేశించారు. ఆ న్యూస్ పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో సొంత మీడియాలో ఫుల్ ప్రచారం చేసుకున్నారు. ఇక అంతే. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదు. కొత్త రోడ్లు వేసింది లేదు.. డొక్కు రోడ్లు రిపేర్ చేయించిందీ లేదు. నిధులుంటేగా రోడ్లు వేసేది. అప్పులేనిదే పూట గడవని ఈ ప్రభుత్వం ఇక రోడ్లు కూడా వేస్తుందా? ఒక్కఛాన్స్ ఇచ్చినందుకు అనుభవిస్తున్నామని.. మా కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు. అదే, జాతీయ రహదారులపై మాత్రం.. వాహనాలు రయ్ రయ్ మంటూ దూసుకెళుతుండటాన్ని చూసి.. ఆ పక్కనే ఉన్న స్థానికులు మా ప్రాంతానికి ఇలాంటి రోడ్లు ఎప్పుడొస్తాయోనని ఎండమావి వైపు చూసినట్టు చూస్తున్నారు. తాజాగా, విజయవాడలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పీచ్ విన్నాక.. వాళ్ల రోడ్లు సరే.. మరి, మన రోడ్ల సంగతేంటి? జగనన్న అంటూ మనసులో ప్రశ్నిస్తున్నారు. అదే ప్రశ్న బయటకు వేస్తే.. ఏ కేసో పెట్టి లోపలేస్తారనే భయం మరి!


