TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీకి పరుగు తీద్దామనుకున్న దినకరన్… కాలడ్డుపెట్టిన ఈసీ

Published on: Mon Apr 10, 2017 12:10PM

అమ్మ, చిన్నమ్మ ఇద్దరూ లేని అన్నాడీఎంకేకి అర్కే నగర్ ఎన్నికలు చుక్కలు చూపిస్తున్నాయి. జయలలిత సమాధిలోకి చేరుకుంటే… శశికళ సుదూరంగా బెంగుళూరులో బెంగగా కూర్చుంది. అదే ఇప్పుడు శశికళ వర్గానికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఢిల్లీ నుంచి ఎదురయ్యే ఒక్కో ఎత్తూ ఎదుర్కోవటం పళని స్వామికి ఉన్నపళంగా సాధ్యం కావటం లేదు. పైగా శశికళ మేనల్లుడు దినకరన్ భవిష్యత్ కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికతోనే ముడి వుండటంతో… మిగతా అన్ని పార్టీల కన్నా శశికళ అన్నాడీఎంకే వర్గానికి టెన్షన్ ఎక్కువగా వుంది!

 

ఈసీ ఆర్కే నగర్ ఉప ఎన్నికని వాయిదా వేయటం పెద్ద ఆశ్చర్యకరమేం కాదు! ఎందుకంటే, అది రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర వ్యవస్థ అయినా రూలింగ్ పార్టీ ఒత్తిడి ఎంతో కొంత పని చేస్తుందని చెప్పే పని లేదు! అంతే కాదు, శశికళ టీమ్ మన్నార్ గుడి మాఫియాపై ముందు నుంచీ మోదీ సర్కార్ గుర్రుగానే వుంది. అందుకే, శశికళని సీఎం అవ్వకుండా చేసి ప్రస్తుతం జైలులో సాదాసీదా ఖైదీలా వుండేలా చేసింది. అదే ఫార్ములాను ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ వాడుతున్నట్టు కనిపిస్తోంది!

 

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ధన ప్రవాహం మామూలే. అదే జరిగింది జయలలిత మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గంలోనూ! కాని, ఈసీ అనూహ్యంగా ఐటీ రైడ్స్ వంక చూపుతూ ఎలక్షన్నే వాయిదా వేసింది. ఇది మంచి పరిణామే అయినప్పటికీ దీని వెనుక ఉద్దేశం బహిరంగ రహస్యమే! జయలలిత స్థానం నుంచీ గెలిచేసి అసెంబ్లీలో కాలు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్న దినకరన్ ను సాధ్యమైనంత మేర అడ్డుకోవటమే కేంద్రంలోని బీజేపి లక్ష్యం. అందులో భాగంగానే అడ్డంగా డబ్బులు పంచుతూ దొరికిన శశికళ వర్గాన్ని ఎన్నికల వాయిదాతో చిరాకు పరుస్తోంది. ఇప్పటికే దినకరన్ వ్యాఖ్యల్లో ఆయన ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలక్షన్ కమీషన్ కూడా నా విజయాన్ని అడ్డుకోవాలనుకుంటోంది… అంటూ ఈసీనే టార్గెట్ చేశాడు! మోదీ సర్కార్ కి కావాల్సింది .. ఖచ్చితంగా ఇదే!

 

ఆర్కే నగర్ లో డబ్బులు పంచేసి శశికళ వర్గం గెలుస్తుందని అందరూ ఊహించిందే! దాన్ని అడ్డుకోవటానికి ఎవ్వరి వద్దా ఎలాంటి మంత్ర దండం లేదు. అయినా సరే చివరి వరకూ గెలుపు అసాధ్యమయ్యేలా వ్యూహాలు పన్నుతున్నారు పన్నీర్ సెల్వం సహా ప్రత్యర్థులంతా! వారికి ఈసీ తీసుకున్న వాయిదా నిర్ణయం, ఆదాయ పన్ను శాఖ దాడులు, భారీగా లభించిన అక్రమ సొమ్ము… ఇవన్నీ కలిసొచ్చే అంశాలే! అయినా, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం దినకరన్ గెలుపును అడ్డుకోవటం ఆసామాషి కాదట! వాయిదాతో కాస్త లేటుగా అయినా ఖచ్చితంగా అసెంబ్లీలో కాలుపెడతాడని అంటున్నారు. అదే జరిగితే తమిళనాడుకి మరో కొత్త ముఖ్యమంత్రితో పాటూ కొత్త గందరగోళమూ తప్పకపోవచ్చు!