కేసీఆర్‌ను కలిసిన బీహారీ బాబులు.. ఏంటి సంగతి?
Published on: Tue Jan 11, 2022 3:10PM
ప్రగతి భవన్‌లో ఏదో జరుగుతోంది. బయటకు కనబడని రాజకీయమేదో నడుస్తోంది. మొన్న కేరళ సీఎం పినరయి విజయన్.. ఆయనతో పాటు సీతారాం ఏచూరీ లాంటి హేమాహేమీ కామ్రెడ్లు. లేటెస్ట్‌గా బీహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్, లాలూ వారసుడు తేజస్వి యాదవ్ కేసీఆర్‌ను కలిశారు. తనతో పాటు మరో నలుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలను వెంటేసుకొని.. చార్టెడ్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారు. నేరుగా, గప్‌చుప్‌గా.. ప్రగతి భవన్‌లో వాలిపోయారు.
ఎక్కడ బీహార్.. ఎక్కడ తెలంగాణ. ఎక్కడ లాలూ ఫ్యామిలీ.. ఇంకెక్కడ కల్వకుంట్ల కుటుంబం. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలిగినట్టు.. ఆర్జేడీ నేతలకు సడెన్‌గా కేసీఆర్‌తో ఏం పని అనే చర్చ మొదలైంది. కేరళ సీఎం వెళ్లివచ్చిన వెంటనే.. బీహారీ బాబులు ప్రగతి భవన్‌కు రావడం కాకతాళీయం మాత్రం కాదు. పక్కా కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే.. జాతీయ స్థాయిలో ఏదో పెద్ద స్కెచ్ వేసే.. ఇలా ప్రగతిభవన్‌ను ఫోర్త్ ఫ్రంట్‌కు అడ్డాగా మారుస్తున్నారని అంటున్నారు.
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.. అన్నట్టు.. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితే అసలేమాత్రం బాగా లేదు.. మరోసారి గెలుస్తారో లేదో నమ్మకం లేదు. ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలో బాగా బలపడుతున్నాయి. ముందు ఇల్లు చక్కదిద్దుకోలేని కేసీఆర్.. నాలుగో ఫ్రంట్ కోసం మాత్రం తెగ ఇదైపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల చెన్నై వెళ్లి స్టాలిన్‌తో సమావేశం కావడంతో మరోసారి జాతీయ మంత్రాంగానికి తెరలేపారు కేసీఆర్. ఇక, గతంలో తోకపార్టీలంటూ తిట్టిపోసిన కామ్రేడ్లను తాజాగా ప్రగతిభవన్‌కి పిలిపించుకొని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడిక పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న ఆర్జేడీ నేతలకు గాలం వేయడం చూస్తుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏదో కెలుకుతున్నారనే అనుమానం. తేజస్వీ యాదవ్ అండ్ టీమ్ కోసం కేసీఆరే స్పెషల్ ఫ్లైట్‌ను బీహార్‌కు పంపించారని.. వారిని అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు రప్పించుకుని జాతీయ రాజకీయాలపై.. ఫోర్త్ ఫ్రంట్‌పై వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, అవుట్‌డేటెడ్‌గా మారిన కామ్రేడ్లు, ఆర్జేడీలు.. నెక్ట్స్ టైమ్ గెలుస్తారో లేదో డౌట్ ఉన్న కేసీఆర్.. ఇలాంటి వారంతా కలిసినా.. జాతీయ స్థాయిలో బలంగా ఉన్న ఎన్డీయే-బీజేపీ-మోదీని ఎదిరించగలరా? మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నా కాంగ్రెస్‌కు పోటీ ఇవ్వగలరా? అంటే అనుమానమే.


