TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నింగికి న‌ది ప్రవహించిందా?!

Published on: Thu Jun 23, 2022 5:44AM

మ‌నం గ‌మ‌నించాలే గాని ఆకాశంలో అద్భుతాలు జ‌రుగుతూంటాయి. సూర్య‌గ్ర‌హణం, చంద్ర‌గ్ర‌హ‌ణ‌మే మ‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలిసిన‌వి.  తోక‌చుక్క ప‌డ‌టం, పెద్ద పెద్ద మెరుపులు వంటివి చూసి ఆశ్చ‌ర్య పోవ‌డం మామూలే. మీరెపుడ‌యినా మ‌బ్బులు కొండ‌మీంచి ప‌డుతున్న ఏటి ప్ర‌వాహంలా ఏక ధాటిగా  వ్య‌తిరేక దిశ‌లో ఆకాశంలో వెళుతూండ‌డం చూశారా?  ఏదో తెల్ల‌టి న‌ది నేల‌మీద‌కి కాకుండా నింగిలోకి వెళుతోన్న‌ట్టు వుంటుంది. అది వివ‌రించ‌డం కంటే చూస్తేనే గొప్ప అనుభూతి, చూసి తీరాలంతే.  ఈ మ‌ధ్య ఆ వింత ని  ద‌క్షిణ ఆస్ట్రేలియాలో జోగార్ గొస్రానీ అనే ఆయన చూసి ఆనందం ప‌ట్ట‌లేక ఏకంగా వీడియో తీసి అంద‌రికీ  తెలిసేలే చేసేడు. 

 అనేకానేక మ‌బ్బుతున‌క‌లు అమాంతం పెద్ద న‌దిలా మారి ఒక్క‌సారిగా  ఇళ్ల‌ మీంచి ఖాళీ రోడ్ల‌మీదుగా అలా  పైకి ప‌శ్చిమ ఆస్ట్రేలియా స్టెర్లింగ్ రేంజ్ లోని బ్ల‌ఫ్ నాల్ ప‌ర్వ‌త శిఖ‌రం  మీదుగా ఆకాశంలోకి వెళ్ల‌డం అనే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అది చూడ్డానికి ఆకాశంలోకి వెనుదిరిగి వెళుతోన్న న‌దిలా తోచింది  గోస్రానీకి. అంతే క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా వీడియో తీసేడు. నేల నుంచి నింగిలోకి వెళ్లిన  న‌ది అని పేరు  కూడా పెట్టేడు. 

ఆకాశంలో ఉన్న‌ట్టుండి మ‌బ్బులు ఒక్క‌సారిగా ప‌ల్చ‌టి వ‌స్త్రంలా మారి ప‌ట్ట‌ణం మీంచి ప‌ర్వతం చుట్టూ తిరిగి ప‌ర్వ‌తం అంచుమీంచి అలా ఆకాశంలోకి ఎవ‌రో పారేసుకున్న పెద్ద వ‌స్త్రంలా ఎగిరిపోయింది. ఇదెలా సంభ‌వం అని ఆశ్చ‌ర్య‌ప‌డే లోగానే అంత అద్భుతం జ‌రిగిపోయింది అని గొస్రానీ అన్నారు.  అది ఆరంభ ద‌శ‌లో చూసి సునామీ అనుకుని కాస్తంత భ‌య‌ప‌డ్డాను. కానీ ఇలా ఆకాశంలో సంభ‌వించి క‌ను విందు చేసే అద్బుతం చూడ‌డం దాన్ని వీడియోలో భ‌ద్ర‌ప‌ర‌చ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు గొస్రానీ. 

అయితే గొస్రానీ అనుకున్న‌ట్టుగా అది నిజంగా మ‌బ్బులతో ఏర్ప‌డిన‌ది కాద‌ని అది  నిజానికి సముద్రపు ఏరోసోల్ (ఎస్ ఎస్ ఏ).  సహజ ఏరోసోల్‌లో ఒకటి అని అమెరికా జాతీయ వైద్యశాఖ లైబ్ర‌రీ అధికారులు తెలియ‌జేశారు.  ఎస్ఎస్ ఏ కూడా అచ్చం మ‌బ్బులానే క‌న‌ప‌డు తుంది కానీ గాలి-సముద్ర క‌లిసేచోట క‌లిగే రాపిడితో  నీటి బుడగలు పగిలిపోవడం వ‌ల్ల  ఆ రూపం వ‌స్తుంద‌ని తెలిపారు. కానీ  ఎంతో  అబ్బురపరిచే దృశ్యం.  అత్యంత అరుదుగా ఆవిష్కృతమయ్యే  అద్భుతం!