ఖడ్గమృగాలతో ఆటలా.. సరదా తీర్చేశాయ్!
Published on: Mon Feb 27, 2023 9:09AM
వన్యప్రాణులతో జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రశాంతతకు భంగం కలిగిస్తే చుక్కలు చేపిస్తాయి. పర్యాటకులు వన్యప్రాణులను చూసేందుకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహం ఎంత మాత్రం పనికిరాదు. అలా అత్యుత్సాహాహానికి పాల్పడితే ఏం జరుగుతుంతో పశ్చిమ బెంగాల్ లోని జలదాపరా నేషనల్ పార్కులో జరగిన సంఘటన రుజువు చేసింది. ఆహ్లాదంగా వన్యప్రాణులను చూస్తూ ఎంజాయ్ చేద్దామని వెళ్లిన పర్యాటకులు చివరకు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అని బయటపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే కొందరు పర్యాటకులు రెండు వాహనాలలో జలదాపరా నేషనల్ పార్కుకు వెళ్లారు.
కేరింతలు కొడుతూ.. విహారం చేస్తుండగా ఖడ్గమృగాలు కనిపించాయి. వెంటనే వాటిని వీడియోలు తీయడం ప్రారంభించారు. అయితే వారి అరుపులు, కేకలు ఖడ్గమృగాల ప్రశాంతతకు భంగం కలిగించాయి. వెంటనే పొదలలో నుంచి రెండు ఖడ్గమృగాలు వారి వాహనాల వైపుకు వేగంగా దూసుకువచ్చాయి. వెంటనే రెండు వాహనాలలోని పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు.
వాహనాలను రివర్స్ లో వేగంగా నడుపుతూ బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో ఓ వాహనం బోల్తా పడింది. అదృష్ఠ వశాత్తూ ఖడ్గమృగాలు వాహనం బోల్తాపడిన తరువాత వారిపై దాడి చేయలేదు. అయితే వాహనం బోల్తాపడటంతో అందులోని వారు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నేషనల్ పార్కులను సందర్శించే పర్యాటకులు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


