TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళలో ఫలించిన రేవంత్ వ్యూహం: యూడీఎఫ్ జైత్రయాత్రకు దారితీసిన తెలంగాణ మోడల్

Published on: Mon May 4, 2026 1:29PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్   తిరుగులేని విజయం దిఇగా  దూసుకుపోతోంది. మొత్తం 140 స్థానాలు కలిగిన కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి ఏకంగా 100  స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంటే..  అధికార ఎల్‍డీఎఫ్ కేవలం 37 స్థానాలతో సరిపెట్టుకోవల్సిన పరిస్థితిలో ఉంది. కేరళలో ఈ అనూహ్య విజయానికి   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. కేరళ ఎన్నికల ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి..  అక్కడ పార్టీకి ఊపిరి పోయడంలో సఫలీకృతులయ్యారు.

కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో  ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది.  కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగాలతో స్థానిక కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపడం ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది.

కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా..  వ్యూహకర్తగా రేవంత్ రెడ్డి కేరళ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేశారు. కొచ్చిలో యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను కేరళ ప్రజలకు వివరిస్తూ,  తెలంగాణ మోడల్  అభివృద్ధిని ప్రమోట్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సాధించిన ప్రగతిని కేరళ ఓటర్ల ముందుకు తీసుకెళ్లడంతో  మార్పు కోరుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.

ఈ ఎన్నికల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో రేవంత్ రెడ్డి సాగించిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో గ్యారెంటీల అమలుపై ఎల్డీఎఫ్ నేతలు విమర్శలు చేయగా..  రేవంత్ రెడ్డి అంతే దీటుగా బదులిచ్చారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి చూసి మాట్లాడాలని ఆయన విసిరిన సవాల్..  కేరళలో కాంగ్రెస్‌కు భారీ మైలేజీని తెచ్చిపెట్టింది. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న వామపక్షాల కోటను బద్దలు కొట్టడానికి రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూకుడు వైఖరి యూడీఎఫ్ కూటమికి వరంగా మారింది.

 కేరళ ఎన్నికలలో  రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన కొచ్చి వంటి కీలక నగరాల్లో  కాంగ్రెస్  అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. పదేళ్ల వామపక్ష పాలనకు చెక్ పెడుతూ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం వెనుక రేవంత్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.