కొడంగల్ లో కేటీఆర్.. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు.