రేవంత్ రెడ్డికి బంపరాఫర్.. కేసీఆర్ పై పోటీ?

 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ మీద విరుచుకు పడుతూ తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. గతంలో కొడంగల్ నియోజవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 'కొడంగల్ ఆయనకు కంచుకోటగా మారింది. కొడంగల్ లో ఆయనకు తిరుగులేదు. మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారు' అనుకున్నారంతా. కానీ టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించి రేవంత్ రెడ్డికి హ్యాట్రిక్ మిస్ అయింది. ఎవరు ఊహించని విధంగా ఆయన ఓడిపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకో అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఖమ్మం ఎంపీగా పోటీ చేయమని రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలు భిన్నంగా వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ సత్తా చాటితే.. ఖమ్మంలో మాత్రం మహాకూటమి సత్తా చాటింది. మొత్తం పది సీట్లకు గాను.. 8 సీట్లు మహాకూటమి గెలుచుకుంటే, టీఆర్ఎస్ ఒక్క సీటుకి పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ సీటు మీద కన్నేసింది. టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఖమ్మం ఎంపీ సీటు ఖచ్చితంగా తమ ఖాతాలో పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే సరైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. స్థానిక నేతలైతే వర్గపోరు తలెత్తే అవకాశముంది. అదే రేవంత్ రెడ్డిని బరిలోకి దింపితే.. నేతలంతా కలిసి పనిచేస్తారు, రేవంత్ ఫాలోయింగ్ కూడా ప్లస్ అయ్యి భారీ మెజారిటీతో గెలవొచ్చని అధిష్టానం భావిస్తోందట. అందుకే రేవంత్ కి ఖమ్మం ఎంపీగా పోటీ చేయమని ఆఫర్ ఇచ్చిందట. ఈ విషయంపై రేవంత్ కూడా సానుకూలంగానే స్పందించారు కానీ.. తుది నిర్ణయం తెలిపేందుకు కాస్త సమయం కావాలని అడిగారట. అయితే ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. ఖమ్మంలో టీఆర్ఎస్ బలపడాలన్నా, ఎంపీ సీటు తమ ఖాతాలో పడాలన్నా కేసీఆర్ పోటీ చేయడమే కరెక్ట్ అని కొందరు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. కేసీఆర్ కూడా ఖమ్మం నుంచి పోటీ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఖమ్మం ఎంపీ పోరులో దిగితే ఇంకేమన్నా ఉందా?. వీళ్ళ పోరు గురించి కొన్ని సంవత్సరాల పాటు చర్చించుకుంటారేమో జనాలు.