TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుజురాబాద్ లో రేవంత్ టీమ్ దూకుడు.. టీఆర్ఎస్, బీజేపీలో వణుకు! 

Published on: Sun Oct 10, 2021 11:17AM

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఇంతకాలం అంతగా దృష్టి కేద్రీకరించని కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించింది.,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధనాల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. హుజూరాబాద్ బరిలో ప్రధాన ప్రత్యర్దులుగా నిలిచిన తెరాస, బీజేపీ  వ్యక్తిగత విమర్శలు, సెంటిమెంట్స్ అదారంగా ప్రచారం సాగిస్తున్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ, పోడు భూముల సమస్య మొదలు పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరల మంట వరకు ప్రజాసమస్యలు ప్రధాన అస్త్రాలుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. 

శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.ఇందులో భాగంగా మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌చార్జులను, సమన్వయకర్తలను నియమించింది. 20 మందితో స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. దసరా పండుగ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రచారంలో ప్రధానంగా విద్యార్థుల, నిరుద్యోగుల, రైతాంగ సమస్యలపై దృష్టి సారించి ఆ వర్గాలను ఆకట్టుకోవాలని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతు కూడగట్టాలని తీర్మానించింది. 

దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా సొంతబలానికి అదనంగా, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నంకొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులను కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి పలు దఫాలుగా తెరాస, బీజేపీ యేతర పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపక పోయినా, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ దేశానికి ప్రమాదకరమని.. ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలకు అది వ్యతిరేకమని గుర్తు చేసింది. హైదరాబాద్‌లో శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర విధానాలను వ్యతిరేకించకుండా కేంద్రంతో కేసీఆర్‌ ప్రభుత్వం లాలూచీ పడుతోందని సిపిఐ ఆరోపించింది. దీంతో ఈ రెండు పార్టీల మద్దతు కాంగ్రెస్ కు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

హుజురాబాద్ లో కాంగ్రెస్ దూకుడు పెంచడంతో అధికార టీఆర్ఎస్, బీజేపీల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఇప్పటివరకు గెల్లు, ఈటల మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ కు డిపాడిట్ రాకపోవచ్చనే చర్చ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీమ్ పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగడంతో సమీకరణలు మారిపోతున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బలపడితే ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ కు ఓట్లు పెరిగితే ప్రజా వ్యతిరేకత ఓటు చీలి టీఆర్ఎస్ కు ప్రయోజనం ఉంటుందని కొందరు వాదిస్తుండగా.. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కారుకు గండం ఉంటుందంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రచారం పెరగడంతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు మాత్రం కలవరపడుతున్నారని అంటున్నారు.