150 ఎకరాల్లో కేసీఆర్ వరి సాగు! టీఆర్ఎస్ నేతలను చెప్పులతో కొట్టాలన్న రేవంత్..
Published on: Sun Dec 26, 2021 6:03PM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగు, వరి ధాన్యం కొనుగోళ్లపైనే నడుస్తున్నాయి. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోన్న మోడీ సర్కారుతో టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసి ఇంకా గద్దెపై ఉంటారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.
తాము పండించిన పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని అన్నారు. రైతులను బానిసలుగా తయారుచేయాలని చూస్తే తిరుగుబాటు తథ్యమని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పిన కేసీఆర్.. తన సొంతపొలంలో పండించిన వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారో చెప్పాలని
రేవంత్ రెడ్డి నిలదీశారు. మీ భూములు పండితే సరిపోతుందా..? రైతులను రాజును చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు. వరి పండించొద్దంటున్న టీఆర్ఎస్ నేతలు ఊళ్లోకి వస్తే చెప్పుతో కొట్టాలని రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు.
వరి వస్తే ఉరే అన్న కేసీఆర్ సొంత వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటిది రైతుల పొంటను ఎలా కొనరో చూస్తాం అని వ్యాఖ్యానించారు. రైతుల కుటుంబ సభ్యుల కడగళ్లు వింటుంటే రోజుల తరబడి అన్నం కూడా సహించడంలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరు 27న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వెంకటాపురం-ఎర్రవల్లి మధ్యలో ఉన్న కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో వరిసాగు చేస్తున్న వైనాన్ని మీడియా మిత్రులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని, ఇంత స్వార్థపూరిత ఆలోచనతో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం మేలు చేస్తుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఫొటోలు చూపిస్తున్నానని, ఇవేవీ బొబ్బిలి, విజయనగరంలో తీసిన ఫొటోలు కావని అన్నారు.


