TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీలోకి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి.. రామ్ మాధవ్ తో మంతనాలు!!

Published on: Thu Jun 13, 2019 11:18AM

 

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలను ఆకర్షించే పనిని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మకాం వేసి, పలువురు నాయకులతో చర్చలు సాగించినట్టు సమాచారం.

అయితే తెలంగాణలో బీజేపీ అడుగులు కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో పాటు ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయగా, ఇప్పుడు మరికొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు నేతలు ఆ పార్టీ నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 

తాజాగా రామ్ మాధవ్‌ తో కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. వీరితో పాటు టీఆర్ఎస్‌ మాజీ ఎంపీ వివేక్‌,  కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావులు కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటప్పటికీ.. నేతలు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బీజేపీ చర్చలు ఫలించి ఎవరైనా నేతలు ఆ పార్టీలో చేరతారేమో చూడాలి.