TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ, TRS కలిసినా కాంగ్రెస్ దే విజయం.. రేవంత్ రెడ్డి మరో సంచలనం

Published on: Sun Jun 27, 2021 7:20PM

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ చీఫ్ ఎంపిక, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, బీజేపీ పరిస్థితి ఏంటీ, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది అన్న చర్చే జనాల్లో సాగుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత రాజకీయ పార్టీల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. బీజేపీకి సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు షాకిచ్చారు. ఆయన త్వరలోనే గులాబీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ లో అసమ్మతి గళం క్రమంగా పెరుగుతోంది. పీసీసీ ప్రకటన వచ్చిన వెంటనే సీనియర్ నేత కేఎల్లార్ పార్టీకి రాజీనామా చేయగా.. ఆదివారం పార్టీ సమన్వయ కమిటికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ పోస్టు కోసం రేసులో నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంపికపై హాట్ కామెంట్స్ చేసి కాక రేపారు. బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాటల దాడి మొదలు పెట్టారు. 

బీజేపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నా, సొంత పార్టీ నేతలు కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు...సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. తెలంగాణ లో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

ఇపుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్ లను విమర్శించడం వికృతమైన చర్య అన్నారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్నారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం వచ్చిందన్నారు. టిఆర్ఎస్,బిజెపి కలిసి పోటీ చేసిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు రేవంత్ రెడ్డి. 
లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినదుకు బిజెపి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.