TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ‌సూళ్ల కోస‌మే టాస్క్‌ఫోర్స్‌.. రేవంత్‌రెడ్డి ఫైర్‌.. కాంగ్రెస్ ఫ్రీ మీల్స్..

Published on: Sat May 15, 2021 3:28PM

వ‌సూళ్ల కోస‌మే క‌రోనా చ‌ర్య‌ల‌పై మంత్రుల‌ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్రగతి భవన్‌లో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో అవసరమైన సమస్యలను చర్చించడం లేదన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో వసూల్ టీం మాత్రమే ఉందని.. వైద్యులు ఎవరూ లేరంటూ త‌ప్పుబ‌ట్టారు. కార్పొరేట్ కంపెనీలను పిలిచి.. దండుకోవడాని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

రెమెడిషివర్ బ్లాక్ మార్కెట్ అయ్యిందంటూ దుయ్య‌బ‌ట్టారు ఎంపీ రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్ నాయకులు కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారని.. కావాల్సిన వారికి రెమెడిషివర్ ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. యశోద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా కోట్ల బిల్లులు వేస్తున్నారని.. మెడిసన్ వాడకుండా బిల్స్ వేస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్ లేదని.. వ్యాక్సిన్ లేక డోసుల వ్యవధి పెంచుతున్నారని రేవంత్ ఆరోపించారు. టిమ్స్‌లో 8 వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదని తెలిపారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. 

క‌రోనా చికిత్స‌కు కేంద్రంగా మారిన హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి నిత్యం వేలాదిగా రోగులు, వారి కుటుంబ స‌భ్యులు వ‌స్తున్నారు. వారికి భోజ‌నం ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. అలాంటి వారి ఆక‌లి తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఉచిత భోజ‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రి ద‌గ్గ‌ర‌ కరోనా రోగులకు ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజనం అందించ‌నున్నారు. 

లాక్‌డౌన్ కారణంగా పేషంట్స్  కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని.. అందుకే తాము ఉచితంగా ఆహారం అందిస్తున్నామ‌న్నారు రేవంత్‌రెడ్డి. గాంధీ హాస్పిట‌ల్‌లో ప్రభుత్వం కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. డాక్టర్లు, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం అందించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అందుకే, డాక్టర్స్, నర్సులు, సిబ్బంది, పేషంట్స్, వారి బంధువుల కోసం.. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసిందని.. అయితే ఈ టైంలో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చెయ్యలేదని రేవంత్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు.