రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా: రేవంత్

 

టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలెవరూ ప్రగతి భవన్‌లోకి వెళ్లలేరని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ప్రజలకోసం ప్రశ్నిస్తే తనపై ప్రభుత్వం వందల అక్రమ కేసులు పెడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయడం మంచిదికాదన్నారు. ప్రతిపక్షం లేకపోతే నియంతృత్వానికి దారితీస్తుందని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం కూలిపోవాలంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు విల్లులు ఎక్కుపెట్టాలని సూచించారు. తాను కార్యకర్తలకు ముందుండి నడిపిస్తానన్నారు. 'నా మెడ తెగిపడే వరకు కేసీఆర్‌తో పోరాడుతూనే ఉంటా.. కేసీఆర్‌కు రాజకీయంగా సమాధి కట్టేది నేనే' అని స్పష్టం చేశారు. మల్కాజ్ గిరిలోఉన్న నిరుద్యోగులు తనకు ఓట్లేస్తే చాలని.. రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే తనపై మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు రేవంత్‌. తనపై పోటీకి అభ్యర్థులు దొరక్క.. రియల్టర్లు, బ్రోకర్లను నిలబెట్టాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందన్న ఆయన.. తనవద్ద డబ్బు లేకపోయినా.. సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ము మాత్రం ఉందన్నారు.