ఛేజ్ చేసి మరీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్.. పోలీసులపై రేవంత్ రెడ్డి ఫైర్
Published on: Mon Jan 10, 2022 11:45AM
నిజామాబాద్ జిల్లాలో బదిలీని తట్టుకోలేక ఉపాధ్యాయురాలు సరస్వతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సరస్వతికి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలోని నిబంధనల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయింది. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెందిన సరస్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఆత్మహత్యకు నిరసనగా ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపిచ్చాయి. విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న సరస్వతి అంత్యక్రియలకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సరస్వతి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీవన్‌రెడ్డి కారును పోలీసులు వెంబడించి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్టును పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా ఖండించారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు సీఎం కేసీఆర్‌కు దొంగల్లా కనిపిస్తున్నారా? అని రేవంత్ ఫైర్ అయ్యారు. పోలీసులు సైతం విపక్ష నేతలను వెంటాడి వెంటాడి అరెస్టు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా? అని నిలదీశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని... భవిష్యత్తులో కేసీఆర్ మూల్యం చల్లించుకోక తప్పదని రేవంత్ పేర్కొన్నారు.


