రేవంత్‌రెడ్డి అరెస్ట్.. సిటీ అంతా తిప్పిన పోలీసులు..
Published on: Thu Feb 17, 2022 9:52AM
రేవంత్‌రెడ్డికి టైం వచ్చింది. కేసీఆర్ బర్త్‌డే రూపంలో మంచి ఛాన్స్ దొరికింది. ఇంత మంచి అవకాశాన్ని ఆయన వదులుకుంటారా? అందుకే, తెలంగాణ వ్యాప్యంగా నిరసనలకు పిలుపు ఇచ్చారు పీసీసీ చీఫ్. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ తాను సైతం ధర్నాకు దిగాలని భావించారు. మరి, రేవంత్‌రెడ్డి అంత దూకుడుగా వ్యవహరిస్తే పోలీసులు ఊరుకుంటారా?
అనుకున్నట్టుగానే ఉదయాన్నే పీసీసీ చీఫ్ ఇంటి ముందు వాలిపోయారు పోలీసులు. రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వామనంలో ఎక్కించుకుని.. సిటీ అంతా తిప్పారు. తొలుత లంగర్‌హౌస్ పీఎస్ వైపు తీసుకెళ్లి.. అక్కడి నుంచి గోల్కొండ పీఎస్‌కు తరలించారు.
రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధకాండ అమలవుతోందన్నారు. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


