ముఖ్యమంత్రి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సలహా

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడల గురించి, ఆయన అనుసరిస్తున్న ఘర్షణ వైఖరి గురించి ఇప్పటికే చాలా విమర్శలు మూటగట్టుకొన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకొనే ప్రయత్నం చేసినట్లు కనబడలేదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులు ఒకరి తరువాత మరొకరు తరచూ ఆయన వైఖరిని తప్పుపడుతున్నారని చెప్పవచ్చును.

 

కేసీఆర్ ఆరోపిస్తున్నట్లు ఆంద్ర ప్రభుత్వం వలననో, లేక కేంద్రప్రభుత్వం వలననో కాక, కేవలం ఆయన అహంభావం వలననే తెలంగాణాకు ఎక్కువ నష్టం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకి తెలంగాణా మీద, ప్రజల మీద అపరిమితమయిన అభిమానం ఉంటే ఉండవచ్చును. కానీ ఆయన  అభిమానం హద్దులు మీరితే అది దురాభిమానంగా మారుతుంటుంది. అప్పుడు అందరూ కూడా శత్రువులు మాదిరిగానే కనబడుతుంటారు.

 

తమిళప్రజలకు తమ తమిళబాష అంటే చాలా అభిమానం. అందుకే అక్కడ తమిళభాష వెలిగిపోతోంది. కానీ వారి ఆ అభిమానం దురాభిమానంగా మారడంతో వారికి ఇతర బాషల పట్ల, ముఖ్యంగా జాతీయ బాష అయిన హిందీ పట్ల తీవ్ర వ్యతిరేఖత కనబరుస్తుంటారు. కానీ దాని వలన హిందీ బాషకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, వారు హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తరచూ అపహాస్యం చేయబడుతుంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన రాష్ట్రం పట్ల ఇటువంటి దురభిమానమే పెంచుకొని, ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లున్నారు. దానికి తోడు తెదేపా, తెరాసల మధ్య గల రాజకీయ వైరం, కేసీఆర్ కు ఆంద్ర పాలకుల పట్ల సహజంగా ఉన్న విద్వేషం వంటి అనేక కారణాలతో ఆయన అందరితో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. కానీ ఆయన వైఖరి వలన తెలంగాణాకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని చెప్పవచ్చును. ఇటు పొరుగు రాష్ట్రం నుండి కానీ కేంద్రం నుండి గానీ తెలంగాణాకు ఎటువంటి సహాయ, సహకారాలు పొందే అవకాశం లేకుండా ఆయనే స్వయంగా తలుపులు మూసుకొన్నట్లుంది.

 

ఈరోజు శాసనసభ ప్రాంగణంలో తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా రాష్ట్ర పరిపాలన చేయడంలో ఘోరంగా విఫలమయిన కేసీఆర్, హరీష్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే ఆయన పరిస్థితులను చక్కబెట్టగలడని అభిప్రాయం వ్యక్తం చేసారు. హరీష్ రావు ఎంత తీవ్ర సమస్యలు ఎదురయినప్పటికీ ఎన్నడూ సంయమనం కోల్పోకుండా చిరునవ్వుతోనే పనులు చక్కబెట్టేస్తుంటారు. బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును. కానీ పదేళ్ళపాటు ఎంతో సమర్ధంగా ఉద్యమాలు చేసి, తెలంగాణా సాధించిన కేసీఆర్, రాష్ట్ర అభివృద్ధికి అదే ఉద్యమస్పూర్తిని కొనసాగించడం తప్పు కాదు. కానీ ఉద్యమాన్ని నడిపినట్లు, ప్రభుత్వాన్ని కూడా అదే ఆవేశంతో నడపాలని ప్రయత్నిస్తున్నందునే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పవచ్చును.

 

తమది మావోయిష్టుల ఎజెండాయే అని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ను అదే మావోయిష్టులు తప్పు పడుతుండటం గమనార్హం. బహుశః అన్ని వైపులా నుండి కురుస్తున్న ఈ విమర్శల కారణంగా తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారేమో కూడా. కారణాలు ఏవయినప్పటికీ ఆయన అనుసరిస్తున్న నిరంకుశ, ఘర్షణ వైఖరి వల్ల, ఇతరుల సహకారం ఎలాగు దొరకదు. పైగా ఆయనకు, ప్రభుత్వానికి, రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి కూడా ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావడం తప్ప వేరే ప్రయోజనం ఉండబోదని చెప్పవచ్చును.