TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్‌ని బస్సెందుకు ఎక్కించుకోలేదు?

Published on: Thu Mar 1, 2018 3:15PM

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో సరైన ప్రాధాన్యం లభిస్తున్నట్టు లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడం ఎంతో బాధాకరమైన అంశం అయినప్పటికీ, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి రేవంత్ రెడ్డేనన్న ప్రచారం కూడా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆ పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా వుండేవారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వారిలో కొంత ఉత్సాహాన్ని తెచ్చింది. అయితే ఆ ఉత్సాహం కేవలం కార్యకర్తల వరకు మాత్రమే పరిమితమైంది. నాయకులలో మాత్రం ఎలాంటి ఉత్సాహం కలిగించలేదు. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకులలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. కాంగ్రెస్ అధికారంలో వస్తే తానే ముఖ్యమంత్రి అని అందరూ కలలు కంటూ వుంటారు. అలాంటి సమయంలో ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’ అంటూ తెరమీదకి వచ్చిన రేవంత్ వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించడం ఖాయం. అందుకే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్టు కనిపిస్తోంది. ఆ విషయంలో కాంగ్రెస్ నాయకులు తాజాగా చేపట్టిన బస్సు యాత్రతో మరింత స్పష్టమైంది.

 

కేసీఆర్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పలువురు కాంగ్రెస్ నాయకులు గత కొద్ది రోజులుగా బస్సు యాత్ర చేస్తున్నారు. సదరు బస్సులో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కాస్తంత పేరున్న నాయకులు, మరికొంతమంది స్థానికంగా మాత్రమే పేరున్న నాయకులు వున్నారు. అయితే రాష్ట్రమంతటా పాపులారిటీ వున్న రేవంత్ రెడ్డిని మాత్రం సదరు బస్సులో ఎక్కించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ద్వితీయ శ్రేణి పౌరుడి మాదిరిగా వున్న రేవంత్ రెడ్డిని బస్సు ఎక్కించుకుంటే ఆయనకు లేనిపోని ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భావించి వుండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తు్న్నాయి. సహజంగానే మంచి వాగ్ధాటి వున్న రేవంత్ రెడ్డిని బస్సు ఎక్కించుకుంటే ఆయన తన మాటల మంత్రజాలంతో మిగతా నాయకులందర్నీ ఓవర్ టేక్ చేసే అవకాశం వుంటుంది. ఇది కూడా రేవంత్ రెడ్డిని బస్సు ఎక్కించుకోకపోవడానికి మరో కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే ఎన్నికలలో ముందడుగు వేయాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని కూడా కలుపుకుని వెళ్ళాలన్న అభిప్రాయాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.