ఒక్క ఫోన్ కాల్ తో రేవంత్ లో మార్పు...!

 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇక రేవంత్ ప్రవర్తించిన తీరు కూడా చూస్తే అది నిజమే అన్న అనుమానాలు రాక తప్పదు. కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని.. ఇక టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానాలు రేవంత్ పార్టీ నిజమే అని తలపించేలా చేశాయి. ఇక రేపో.. మాపో ఆయన కాంగ్రెస్ పార్టీ చేరడమే తరువాయి అనుకున్న వారందరికీ  రేవంత్ షాకిచ్చాడు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. పార్టీ మారుతున్నానంటూ మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని యూటర్న్ తీసుకున్నారు. మీడియాలో వస్తున్న వార్తలతో కార్యకర్తలు అపోహపడుతున్నారని, కార్యకర్తలు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దన్నారు. దీంతో ఓ హెవీ సీన్ కి కాస్త లైట్ గా మార్చేశారు. అయితే రేవంత్ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటబ్బా అని ఆలోచించుకుంటున్నారు.

 

అయితే దీని వెనుక ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టు రాజకీయ వర్గాల టాక్. చంద్రబాబు రేవంత్ కు ఫోన్ చేయడంతో రేవంత్ మనసు మార్చుకున్నారట. ఇంతకీ చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఏం చెప్పారనుకుంటున్నారా...? అది అందరికీ తెలిసిన రహస్యమే. నేతలైతే పార్టీ మారుతున్నారు కానీ... అధికార పార్టీలో వారికి ఉన్న స్థానం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విషయం చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెప్పారట. పార్టీ వదిలివెళ్లిన టీడీపీ నేతలు ఇతర పార్టీల్లో ఎలా బతుకు వెళ్లదీస్తున్నారో తెలుసుకోవాలని మాత్రమే సూచించారట. టీడీపీ పార్టీ నుండి చాలామంది నేతలే అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఉదాహరణకు ఎర్రబెల్లినే తీసుకోవచ్చు. టీటీడీపీ నేతల్లో ఎర్రబెల్లి కీలక నేతగా ఉండేవాడు. ఎప్పుడైతే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాడో.. కనీసం ఆయన పేరు కూడా వినిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి ఒక్క ఎర్రబెల్లికే కాదు.. చాలా మంది నేతలు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి పార్టీ ఎందుకు మారాంరా బాబూ అంటూ తలపట్టుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుని ఆచితూచి అడుగు వేయమని మాత్రమే చంద్రబాబు సూచించారట.

 

దీంతో ఒక్కసారిగా అంతా రివైండ్ చేసుకున్న రేవంత్ రెడ్డి తాను ఏం చేస్తున్నానో తప్పు తెలుసుకొని.. యూటర్న్ తీసుకున్నారని రాజకీయ వర్గాల టాక్. మొత్తానికి ఏదో చేయాలనుకొని.. ఏదో చేసి.. అనవసరపు రచ్చ చేసుకొని.. ఆఖరికి జ్ఞానోదయం అయి.. ఇప్పటికి రేవంత్ రెడ్డి తప్పు తెలుసుకున్నాడు. మరి ఈ వ్యవహారానికి రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందా.. ఏం జరుగుతుందో..చూద్దాం.