పెళ్లి తెచ్చిన తిప్పలు..

ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనుషులకు కొత్త బంధుత్వాలు, పరిచయాలు ఏర్పడతాయని.. మనసుల మధ్య దూరం తగ్గుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక పెళ్లి.. ఒక పార్టీకి.. ఒక స్ట్రాంగ్‌ లీడర్‌ దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యర్థులను తిట్టినట్లుగానే సొంతవాళ్లని తిట్టేలా చేసింది. ఆ పెళ్లి ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ది.. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ.. ఆ బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి. పరిటాల శ్రీరామ్ పెళ్లి టీడీపీకి, రేవంత్‌కు రెడ్డి మధ్య ఉన్న బంధాన్ని తెంచేసింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

తన కుమారుడి పెళ్లికి బంధువులు, సన్నిహితులు, పార్టీ పెద్దలు అందరినీ ఆహ్వానించిన సునీత.. ఒకప్పటి తమ పార్టీ నేత, తన భర్తకు ఆప్తుడు అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలిసి వివాహానికి హజరవ్వాల్సిందిగా శుభలేఖ అందజేశారు. దీనికి ఎంతో సంతోషించిన సీఎం తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే పెళ్లిరోజు హైదరాబాద్ నుంచి వెంకటాపురం వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ చంద్రశేఖర్ రావే.

 

సీమ గడ్డ మీదకు వచ్చి రాగానే ఇక్కడి ప్రజలు ఆయన్ను ఆహ్వానించిన తీరు నిజంగానే అద్భుతం.. ఇక్కడి వారు కూడా కేసీఆర్‌ను ఇంతగా అభిమానిస్తున్నారా అన్నది కళ్యాణ మంటపంలోనే జై కొట్టడంతో అర్థమైపోయింది. ప్రజాభిమానం సరే.. ఆంధ్రా టీడీపీ నాయకులు చేసిన హడావిడి, అత్యుత్సాహం తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తనను జైలులో పెట్టించిన కేసీఆర్‌కు సొంతపార్టీ నేతలు సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆయన తట్టుకోలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. అందుకే ఆయన పార్టీ మారబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు రేవంత్ వరుస ఢిల్లీ పర్యటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా.. పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

 

దీంతో రెండు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణను అధ్యక్షుడిగానూ.. రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ నియమించారు. తెలంగాణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకొని, చక్కదిద్దే సమయం చంద్రబాబు లేకపోవడంతో ఈ వ్యవహారాలను రమణ, రేవంత్‌ భుజాలపై వేశారు టీడీపీ అధినేత. వివిధ స్వప్రయోజనాలను ఆశించి ఎంతో మంది పార్టీని వీడి వెళ్లిపోతున్నా వీరిద్దరూ మాత్రం.. పార్టీని ఎలాగొలా లాక్కొస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంతంగా లీడ్ తీసుకొని అనేక సందర్భాల్లో కేసీఆర్ పాలనను ఎండగట్టారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పటికీ కేసీఆర్‌కు భయపడకుండా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బాబు కూడా రేవంత్ రెడ్డికి అమితమైన ప్రాధాన్యతనిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు.. రేవంత్ కూమార్తె పెళ్లి సందర్భంగా కుటుంబంతో సహా హాజరయ్యారు.

 

బాబు పదవిలో ఉన్నా.. లేకున్నా ఇంత ప్రయారిటీ మరే నేతకు ఇవ్వలేదని పచ్చ కండువాలు చెప్పుకుంటున్నాయి. మరి అంతటి ప్రాధాన్యతను రేవంత్ కోల్పోతారా..? నిజానికి తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి వాగ్దాటి, ఛరిష్మా రేవంత్ సొంతం. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డే కేసీఆర్‌కు సరైన ప్రత్యామ్నాయమని ఎన్నో సర్వేలు తేటతెల్లం చేశాయి కూడా. అందుకే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పార్టీ శ్రేణులు రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మరి ఇంతటి ఆదరణను ఆయన చేజేతులా వదులుకుంటారా..? మరో వైపు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. తమ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అన్నీ వివరిస్తానని రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు వచ్చిన తర్వాత కానీ రేవంత్ నిర్ణయం ఏంటనేది తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.