బీజేపీ చెప్పేదంతా అబద్దం.. మేమంతా ఒకటే...

 

అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో జేడీఎస్ కీలకంగా మారిన సంగతి కూడా విదితమే. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ పార్టీని తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే జేడీఎస్ తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పేశారు. అంతేకాదు కుమార స్వామిని ముక్యమంత్రిగా చేసేందుకు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది.  బీజేపీ కూడా రంగంలోకి దిగి ఎలాగైన అధికారం చేపట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే  బీజేపీ దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రేవణ్ణ వెనకాల దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో ఇప్పుడు జేడీఎస్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.

 

అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ... తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి కూడా మాట్లాడుతూ... తనను జేడీఎస్ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైపు రాకపోతే ఇన్కమ్ టాక్స్ రైడ్ లు వంటివి చేయిస్తామని కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...