ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా ఫైనల్ గా ఆ టెస్ట్ చేయాల్సిందే... కేంద్రం ఆదేశం

మనదేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా కరోనా టెస్టుల పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఒకవేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మరోసారి ఆర్టీ-పిసిఆర్ విధానంలో తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయితే, ఆ టెస్టులో నెగిటివ్ వస్తే ఆర్టీ-పిసిఆర్ టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టుగా తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, శ్వాస కు సంబంధించిన సమస్యలతో కూడిన లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా మళ్లీ ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పకుండా చేయాలి.

 

అంతేకాకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల గడిచిన తరువాత కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వారిని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఈ తాజా ఆదేశాలను పాటించడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, అంతేకాకుండా ఈ వైరస్ మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనా టెస్టుల్లో ఆర్టీ-పిసిఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.