అధ్వానంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది!

ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ చెల్లింపులు ఆలస్యమవ్వడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

 

"ఈ నెల పెన్షన్ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, బడ్జెట్లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒకరోజు అటు ఇటు గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక వారం పెన్షన్ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అర్ధాన్నం గా ఉన్నది అర్థమవుతున్నది." అని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.

 

"ఆదాయానికి పొంతన లేని వ్యయంతో ముందుకు పోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇటువంటి భంగపాటు తప్పదు. ఒక నాలుగు రోజులు ముందా వెనక అంతే." అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.

కాగా, ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజధాని మార్పు అంశంపై స్పందించిన ఆయన.. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదన్నారు.

 

ప్రస్తుతం ఐవైఆర్ కృష్ణారావు, రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమయానికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేని ప్రభుత్వం.. అసలు మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తుంది? ముందు ముందు రాష్ట్రాన్ని ఎలా నడుపుతుంది? పథకాలను ఎలా అమలు చేస్తుంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.