రెస్టారెంట్లు, మాల్స్‌ తిరిగి ప్రారంభం ..సీఎం ఆదేశాలు!

ఏపీలోని అన్ని దుకాణాల్లో సామాజిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ దుకాణం ముందు దుకాణ దారులే వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించకుండా చర్యలు  తీసుకుంటూనే, ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలని సీఎం జగన్ అన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వలస కూలీల పరిస్థితి చూస్తే బాధేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. వలస కూలీల పట్ల మానవీయ కోణాన్ని మరచిపోవద్దని.. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీల కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వలస కూలీల నుంచీ టికెట్టు కూడా అడగవద్దని ఆదేశాలు జారీ చేశారు.

రెస్టారెంట్లు, మాల్స్‌ తిరిగి క్రమ, క్రమంగా ప్రారంభం కావాలని, వీటి కార్యకలాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలన్నారు. అలాగే కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు.. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.