TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు ఊరట

Published on: Thu Sep 25, 2025 4:43PM

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో  భారీ ఊరట లభించింది.   కాళేశ్వరం ప్రాజెక్టులో  అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో  ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై స్మితా సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం (సెప్టెంబర్ 25)న సభా సభర్వాల్ పై నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యా తీసుకోవద్దంటూ ఆదేశాలుజారీ చేసింది.  ఇదేవిషయమై ఇప్పటికే  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వంటి నాయకులకు కూడా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. 


తెలంగాణ ఆవిర్భావం తరువాత అధికారం చేపట్టిన   కేసీఆర్    అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి. రేవంత్ రెడ్డి   నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం అక్రమాలపై విచారణకోసం జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్   ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచి చర్చించింది.

ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, ఆర్థిక అవినీతి, టెక్నికల్ లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వంటి అనేక అంశాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ  మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ సీ మురళీధర్ రావు వంటి అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులని పేర్కొంది. బ్యారేజ్‌ల నిర్మాణాలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్యాబినెట్ ముందు పెట్టకపోవడం, బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడం వంటి  విషయాలలో స్మితా సభర్వాల్ ను కూడా కమిషన్ నివేదికలో తప్పుపట్టింది.  

ఈ నివేదికలో తన పేరు ప్రస్తావించబడటానికి వ్యతిరేకంగా స్మితా సభర్వాల్ ఈ నెల 23న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   నివేదికలో తన పేరును తొలగించాలని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించి,  ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దనీ,  ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో కలిపి స్మితా సభర్వాల్ పిటిషన్ ను కూడా విచారి స్తామనీపేర్కొంది.