తమిళనాట.. ఓట్ల లెక్కింపునకు ముందే రిసార్ట్ రాజకీయం
Published on: Mon May 4, 2026 7:57AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఎగ్జిట్ పోల్స్ కింగ్ మేకర్‌గా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అవతరిస్తుందని అంచనా వేసిన నేపథ్యంలో.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తన పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు విజయ్ అలర్ట్ అయ్యారు.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చోటుచేసుకునే పరిణామాలపై విజయ్ తన అభ్యర్థులకు ఇప్పటికే స్పష్టమైన దిశానిర్దేశం చేశారని అంటున్నారు.
ప్రత్యర్థి పార్టీలు భారీ ఆఫర్లతో సంప్రదించే అవకాశం ఉన్నందున, ఎవరూ వారితో చర్చలు జరపవద్దని విజయ్ తన పార్టీ అభ్యర్థులకు సూచించినట్లు తెలిసింది. అలాగే.. ఫలితాల ప్రకటన అనంతరం పార్టీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కొత్త పార్టీ కావడంతో అభ్యర్థుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకే విజయ్ రిసార్ట్ వ్యూహం పన్ని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


