TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజీనామా చేయను డీఎల్‌

Published on: Wed Feb 8, 2012 1:43PM

హైదరాబాద్‌ : మంత్రి పదవిలో కోతపై తనకు అసంతృప్తి లేదని, శాఖపై అసంతృప్తితో రాజీనామా చేసే ఆలోచనలో తాను లేనని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 1978లోనే తనది స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర అన్నారు. ఆ తర్వాత తాను కాంగ్రెసు పార్టీలో చేరి ఇంత ఉన్నత స్థానానికి చేరుకున్నానని అన్నారు. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.  జగన్‌పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీకి విధేయంగా ఉంటామని సోనియాకు వివరించామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని తాను మంత్రి పదవి అడగలేదని, ఆయన పిలిచి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. మంత్రిగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు చెప్పిన పనులు తాను చేసి ఉండకపోవచ్చన్నారు. తప్పు చేయమంటే తాను చేయనని, అబద్ధాలు చెప్పనని తెలిపారు. పదవుల కోసం సూట్‌కేసులు పట్టుకుని చెన్నయ్‌, ముంబై మీదుగా ఢిల్లీ వెళ్లేవాడిని కాదన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్‌ తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల బాగు కోసం ప్రయత్నించానని డీఎల్‌ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య శాఖలను రెండుగా విభజిస్తామంటే సరేనన్నానని ఆయన తెలిపారు. ఏ పరిపాలన సౌలభ్యం కోసం వైద్య విద్యను ఆరోగ్య శాఖలో అప్పుడు విలీనం చేశారో, మరే పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖను విడదీశారో తనకు తెలియదని డీఎల్‌ చెప్పారు.

అయితే కొన్న దురదృష్టకర సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేశానని అన్నారు. నా విద్యుక్త ధర్మంలో తానెప్పుడూ తప్పు చేయలేదని, ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. రాజకీయాల నుండి అయినా తప్పుకుంటాను కానీ తప్పు మాత్రం చేయనన్నారు. ఎవరైనా తన శాఖలో విచారణకు ఆదేశిస్తే తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తనకు శాఖను తగ్గించిన దానికంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బాధించాయన్నారు. తన తండ్రి వైయస్సార్ రెక్కల కష్టంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాలిస్తుందని జగన్ వ్యాఖ్యానించారని, వాటి పట్ల తాను చాలా ఆవేదన చెందానన్నారు. ఆయన వ్యాఖ్యలు ఎవరూ ఖండించక పోవడం బాధాకరమన్నారు. కాగా అంతకుముందు డిఎల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.