రాజ్‌పథ్ సాక్షిగా రాహుల్‌కు అవమానం

69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో హాజరైన రాహుల్ గాంధీకి అవమానం జరిగింది. రిపబ్లిక్ వేడుకలకు హాజరైన ఆయనకు ఆరవ వరసలోని సీట్లను కేటాయించడంపై కాంగ్రెస్ మండిపడింది. మోడీ సర్కార్ సాంప్రదాయాన్ని పక్కనబెట్టి దిగజారుడు రాజకీయాలకు దిగుతోందని విమర్శించింది. గతంలో ఏఐసీసీ అధినేత్రిగా సోనియా గాంధీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ముందువరుసలో కూర్చునేవారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ను కావాలనే ఆరవ వరుసలో కూర్చోబెట్టారని ప్రభుత్వం ఎలా వ్యవహరించినా సరే తమకు గణతంత్ర దినోత్సవ వేడుకలే ప్రధానమని చెప్పుకొచ్చింది కాంగ్రెస్. ఈ మేరకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పక్కన కూర్చొన్న రాహుల్ ఫోటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడిది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.