టీడీపీకి మరో బిగ్ షాక్.. ఏపీలో వైసీపీదే విజయమంటున్న సర్వే!!

 

ఎన్నికల హడావుడి మొదలవుతుంటే సర్వేల సందడి మొదలవ్వడం సహజం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక, బలాబలాల అంచనాతో బిజీ బిజీగా ఉన్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు సర్వేలతో బిజీగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఏపీలో కూడా సర్వే నిర్వహిస్తున్నాయి. తాజాగా ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌' సంస్థలు ఏపీ పార్లమెంట్ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ఫలితాలు అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ.. వైసీపీ 41.3 శాతం ఓట్లతో 19 ఎంపీ సీట్లు, టీడీపీ 33.1 శాతం ఓట్లతో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. గత ఎన్నికల్లో  ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రాగా, వైసీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇప్పుడు సర్వే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది.

అయితే ఈ సర్వేపై విమర్శలు కూడా వెల్లువెతున్నాయి. బీజేపీ, వైసీపీలు సర్వేల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. '2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు విడుదల చేసారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది' అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సర్వేలో చెప్పినట్లు వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో లేక 2014 ఫలితాలే రిపీట్ అవుతాయో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.