TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రగిరిలో రీపోలింగ్‌.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

Published on: Thu May 16, 2019 2:32PM

 

ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తే చాలని ఎన్నికల సంఘం తీర్మానించింది. ఆ మేరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు పోలింగ్ బూత్‌లలో పని పూర్తి చేసింది. అయితే ఇక కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా హఠాత్తుగా ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించి షాకిచ్చింది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌కే రుడోలా ఉపఎన్నికల నోట్‌ విడుదల చేశారు. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు రీపోలింగ్‌ జరుగుతుందని ఆ ప్రకటన సారాంశం. ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, పులివర్తి వారి పల్లి, కొత్త ఖండ్రిగ, కమ్మపల్లి, వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుంది.

పోలింగ్ జరిగిన ఇరవై ఐదు రోజుల తర్వాత.. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని సీఈవోకి వినతి పత్రం ఇచ్చారు. ఏమైనా జరిగి ఉంటే పోలింగ్ ముగిసిన వెంటనే ఫిర్యాదు చేయాలి కానీ ఇరవై ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే.. చెవిరెడ్డి ఫిర్యాదు చేయడం.. వెంటనే సీఎస్ ఎల్వీ కూడా చర్యలు తీసుకోవాలని లేఖ రాయడం. ఆ వెంటనే సీఈవో రీపోలింగ్‌కు సిఫార్సు చేస్తూ సీఈసీకి లేఖ పంపడంతో.. రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు రావడం.. అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే పోలింగ్ జరిగిన మరునాడే 27 కేంద్రాల్లో చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈసీని కోరారు. కానీ, ఈ వినతిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో తాజా ఈసీ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ, సీఎస్, ఈసీ అంతా కలిసి ఓ ప్లానింగ్ ప్రకారం చేసారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈసీ నిర్ణయానికి నిరసనగా తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు మంత్రి అమరనాథరెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.  పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైసీపీ ఫిర్యాదు చేస్తే.. రీపోలింగ్‌కు ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరిన చోట ఎందుకు రీ పోలింగ్ నిర్వహించడం లేదో చెప్పాలని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నిస్తున్నారు. ఈసీ నిర్ణయాలు ఏక పక్షంగా ఉన్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.