ఇక్కడ కాబట్టి మోడీ సేఫ్.. బయట అయితే..!

 

ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో నవ్విన రేణుకా చౌదరిపై కామెంట్లు విసిరిన సంగతి తెలిసిందే కదా. సభలో మోడీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలందరూ మోడీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అదే సమయంలో రేణుకా చౌదరి కూడా  అంతరాయం కలిగించారు. అంతేకాదు ఆమె మధ్య మధ్యలో గట్టిగా నవ్వడంతో.. దానిపై స్పందించిన మోడీ..అప్పట్లో రామాయణంలో ఇలాంటి వికటాట్టహాసాలు వినేవాళ్లమని, ఇప్పుడు మరోసారి వింటున్నామని చురకలు అంటించారు. అయితే ఇప్పుడు రేణుకా చౌదరి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించి... గతంలో ప్రధాని మోదీ ఆధార్‌ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని... అలాంటి మోదీ ఇపుడు ఆధార్‌ ను పుట్టించినదే తాము అని చెబితే నవ్వకుండా ఉండగలమా? అని అన్నారు. అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని... ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసు నమోదై ఉండేదని ఆమె హెచ్చరించారు.