ఖమ్మం అసెంబ్లీ.. మహాకూటమి నుండి ఎవరో?

 

ఖమ్మం అసెంబ్లీకి తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుండి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉత్కంఠను రేపుతాయి. తెలంగాణలో ముందస్తుకు తెరలేవడంతో ఖమ్మం రాజకీయం కూడా వేడెక్కింది. ఇప్పటికే తెరాస, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అజయ్ కుమార్ సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు. అజయ్ 2014 లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది.. అనంతరం తెరాసలో చేరారు. మరోవైపు ఆయనకు పోటీగా టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తుమ్మల కూడా తెరాస లో చేరారు. మంత్రిగా కూడా పనిచేసారు.

ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో నువ్వా నేనా అంటూ పోటీ పడిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఇప్పుడు మహాకూటమితో దగ్గరయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థి ఎవరా? అంటూ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి బరిలోకి దిగుతారు అంటుంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారు అంటున్నారు. అయితే ఈ ఇద్దరు పార్టీ అధినాయకత్వం, కూటమి నిర్ణయమే మా నిర్ణయమని చెప్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఖమ్మంలో బలమైన కేడర్ ఉంది కాబట్టి ఆ స్థానాన్ని మాకే కేటాయించాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ మాత్రం నామా నాగేశ్వరరావు పోటీ చేస్తే ఆ స్థానం వదులుకోవడానికి సిద్ధం.. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖుత వ్యక్తం చేయకపోతే మాత్రం ఆ స్థానం మాకే అని తేల్చినట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నుండి రేణుక పోటీ చేయని పక్షంలో బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరరావు లాంటివారు ఉవ్విళ్లూరుతున్నారు. చూద్దాం మరి మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం నుండి ఎవరు బరిలోకి దిగుతారో ఏంటో.