TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ ఇమేజ్‌కు రేణు డ్యామేజ్ తప్పదా?

Published on: Fri Jul 13, 2018 3:05PM

రాజకీయాల్లోకి దూకిన గబ్బర్ సింగ్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. ఉత్తరాంధ్రలో తనదైన రాజకీయం చేస్తున్నాడు. యాత్ర చేస్తూ జనంతో మమేకం అవుతున్నాడు. దీని తరువాత ఆంధ్రలో మరిన్ని చోట్ల జనసేనాని కవాతు కొనసాగనుంది. అయితే, తీరా ఎన్నికల వేళ పోలింగ్ నాడు పవన్ ప్రభావం ఎంత వుంటుంది? ఇది చెప్పటం కష్టమే. ఎందుకంటే, పవన్ డ్యామేజ్ టీడీపీ, వైసీపీలకు ఎంత వుంటుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడ్డది. అసలు వుంటుందా అనే అనుమానం వ్యక్తం చేసేవారూ లేకపోలేదు!

 

 

వచ్చే ఎన్నికల్లో జనసేన ఫలితాలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం పవన్ చుట్టూ వివాదాలు బాగానే ముసురుకుంటున్నాయి. రాజకీయాల్లోకి రావటం, అందులోనూ ఒక పార్టీ పెట్టి స్వంతంగా రణరంగంలోకి దిగటం మామూలు విషయం కాదు. ఇదే అదనుగా గత తప్పిదాలు, పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయి. అదే జరుగుతోంది పవర్ స్టార్ విషయంలో కూడా! ఆయన గురించి ఏదైనా ఆరోపణ చేయాల్సి వస్తే ముఖ్యంగా వ్యక్తిగత జీవితమే ఈజీ టార్గెట్ అవుతుంటుంది. అందులోనూ ఆయన మూడు పెళ్లిల్లు ఎప్పుడూ వివాదాస్పదమే. విమర్శలకు కారణమే! ఎన్నికల ఫీవర్ మొదలైన ప్రస్తుత తరుణంలో కూడా మరోసారి ఆయన ట్రిపుల్ మ్యారెజెస్ తిప్పలు తెచ్చిపెట్టేలా వున్నాయి!

 

 

పవన్ రెండో భార్య రేణు దేశాయ్ చాలా కాలం సైలెంట్ గానే వున్నారు. కానీ, వున్నట్టుండీ ఈ మధ్య కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. ఆమెను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం అసలు గొడవకి కారణం. అయితే, ఇదంతా పాత సంగతే. కానీ, ఈ మద్యే ఎంగేజ్ మెంట్ చేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైన రేణు గతంలో ఎప్పుడూ బయటపెట్టని సంగతులు బయటపెట్టి పవన్ ను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. పవన్, రేణు విడిపోవటం నిజానికి పెద్ద వివాదమేం కాదు. వారు బాహాటంగానే విడిపోయారు. డైవోర్స్ కూడా తీసేసుకున్నారు. కానీ, సమస్యంతా ఇప్పుడు ఆమె పవన్ మూడో భార్య మొదటి సంతానం గురించి చెప్పటంతోనే మొదలైంది.

 

 

పవన్ ని బాగా విమర్శిస్తూ, టీడీపీకి అనూకులంగా గొంతు వినిపించే ఓ ఛానల్లో రేణు తన బాధ వెళ్లగక్కారు. తనకి విడాకులు కూడా ఇవ్వకుండానే పవన్ మరో స్త్రీతో బిడ్డకు తండ్రయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నిజంగా కొంత డ్యామేజింగ్ అంశమే! దానిపై యధావిధిగా సోషల్ మీడియాలో రచ్చ జరగటంతో తాజాగా రేణు దేశాయ్ పీఆర్ టీమ్ మరిన్ని వివరాలు బయటపెట్టింది. డేట్లతో సహా పవన్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేసింది!

 

 

2012 మార్చ్ 13న పవన్ మూడో భార్య లెజోనోవాకి పొలెనా పుట్టిందని ఫేస్బుక్ లో చెప్పిన రేణు పీఆర్ టీమ్… మార్చ్ 16న పవన్, రేణుల విడాకులు జరిగాయని గుర్తు చేసింది! అంటే, అంతకు ముందు సంవత్సర కాలం రేణు భార్యగా వుండగానే లెజోనోవా గర్భవతిగా వుందన్నమాట. ఇలా ఒకరితో చట్టబద్ధమైన వైవాహిక బంధంలోవుంటూ మరొకరితోనూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయటం… తప్పు, నేరమూ కూడా అవుతుంది! ఈ విషయంలో రేణు వ్యక్తిగతంగా పవన్ ను ఇప్పుడేం అనకపోయినా…. అదును చూసి విషయం బయటపెట్టడం… కాస్త ఆసక్తికరం, ఆందోళనకరమే! ఎన్నికలకి ముందు ఇలాంటి విషయాలు పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయనే చెప్పాలి. మరి ఓట్ల రూపంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే!