వినోద్ జైన్ టార్చర్ టూమచ్.. బెజవాడ బాలిక సూసైడ్ కేసులో రిమాండ్ రిపోర్ట్
Published on: Wed Feb 2, 2022 10:49AM
వాడు మనిషి కాదు మృగాడు. మనిషి రూపంలో ఉన్న పశువు. 50ఏళ్ల పైబడిన పైశాచికుడు.. కామాంథుడు. విజయవాడ బాలిక సూసైడ్ కేసులో నిందితుడు వినోద్ జైన్ ఆ బాలికతో ఎంత దారుణంగా ప్రవర్తించాడో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇప్పటికే ఆ బాధితురాలు సూసైడ్ నోట్‌లో వాడి టార్చర్ గురించి పూసగుచ్చినట్టు వివరించగా.. ఆ లెటర్ వైరల్ అయింది. ఇప్పుడు పోలీసులు సైతం ఆ విషయాలను కన్ఫామ్ చేసేలా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు.
‘నీవు అందంగా ఉన్నావు.. కాళ్లు పొడవుగా ఉన్నాయి. జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటావు..’ అంటూ వెకిలి మాటలతో మానసికంగా, శారీరకంగా వేధించాడు ఆ ఉన్మాది వినోద్ జైన్. తన కూతురు వయసు ఉందని కూడా చూడకుండా.. వయసు మరిచి, స్థాయి మరిచి, దిగజారి, నీచంగా, దారుణంగా ప్రవర్తించాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటుండటంతో.. ఆ బాలిక కోసం కాపు కాసి.. సొల్లు కార్చేవాడు ఆ వెదవ.
అపార్ట్‌మెంట్ లిఫ్ట్ దగ్గర, మెట్ల దగ్గర అసభ్యకరమైన మాటలతో పదే పదే వేధించేవాడు వినోద్ జైన్. బాలిక శరీర భాగాలను తాకుతూ వెకిలిగా మాట్లాడేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. బాలిక తన బ్రదర్‌ను స్కూలు ఆటో ఎక్కించేందుకు వచ్చేటప్పుడు, సరకుల కోసం బయటకు వెళ్లే టైంలో.. అక్కడే కాచుకు కూర్చొని మరీ వేధించేవాడు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు. రెండు నెలలుగా డైలీ ఇదే టార్చర్. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోయేది ఆ తొమ్మిదో తరగతి అమ్మాయి. ఇంట్లో చెప్పలేక, అంకుల్ రూపంలో ఉన్న ఆ తోడేలు టార్చర్ భరించలేక.. తనలో తాను కుమిలిపోయేది. నిత్యం నరకం చూసేది.
ఇక వాడి వేధింపులు భరించలేక.. చివరకు తను సూసైడ్ చేసుకుంది. గత నెల 29వ తేదీన సాయంత్రం 5.15 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి.. దూకి.. ఆత్మహత్య చేసుకుంది. దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్, బుక్స్, సెల్‌ఫోన్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. 12 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేశారు. సూసైడ్ లెటర్‌లో వినోద్ జైన్ చర్యల గురించి స్పష్టంగా వివరించిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. వేధింపులకు సంబంధించి బాలిక ఫోన్, ట్యాబ్‌లోనూ పలు మెసేజ్‌లు ఉన్నాయని గుర్తించారు.
వినోద్ జైన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. వాడు సమాజంలో పలుకుబడి ఉన్నోడు. చాలా ఏళ్ల పాటు బీజేపీలో కొనసాగాడు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవలే టీడీపీలో చేరాడు. ఘటన జరిగిన వెంటనే వినోద్ జైన్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది టీడీపీ. చంద్రబాబు సైతం బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఫ్యామిలీకి అండగా నిలుస్తామని చెప్పారు. మృతురాలి తరఫున కేసు వాధించేందుకు పార్టీ తరఫున లాయర్‌ను ఏర్పాటు చేసి వినోద్ జైన్‌కు ఉరి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. విజయవాడలో సంచలనంగా మారిన వినోద్ జైన్ ఘటన అటు రాజకీయంగానూ ప్రకంపణలు రేపుతోంది. బీజేపీ-వైసీపీ-టీడీపీ మూడు పార్టీలకూ మరక అంటుకుంది.


