TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ కు కోర్టులో ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశించిన న్యాయస్థానం

Published on: Thu Jun 18, 2026 12:14PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత   పవన్ కల్యాణ్‌కు కోర్టులో  ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆయనపై  సోషల్ మీడియాలో వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలకు అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సివిల్ కోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేని, ధృవీకరించని ఆరోపణలను ఆన్‌లైన్ వేదికలపై వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు కోర్టు  జాన్ డో’ నిరోధక ఉత్తర్వులను జారీ చేసింది.  

 వివాదం వివరాల్లోకి వెడితే..   తెలంగాణ  రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో   ప్రచారం జరిగింది. వైసీపీ,  తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల  కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది. సదరు భూమి చెరువు పూర్తి నీటి మట్టం  పరిధిలోకి వస్తుందని వారు ఆరోపించారు. అయితే..  ఈ తప్పుడు ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని పవన్ కల్యాణ్   కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందే ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను ప్రముఖ టెక్ దిగ్గజాలకు పంపినట్లు వారు కోర్టుకు వివరించారు.

ఈ కేసును కూలంకషంగా పరిశీలించిన బెంగళూరు సివిల్ కోర్టు..  పవన్ కల్యాణ్ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎలాంటి ఆధారాలు లేని కథనాలను ప్రసారం చేయడాన్ని తప్పుబట్టింది. పవన్ కల్యాణ్‌పై నిరాధారమైన భూ ఆక్రమణ ఆరోపణలు చేసిన దాదాపు 12 లింకులను   కోర్టు తన ఉత్తర్వులలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ నిర్దిష్ట లింకులతో పాటు పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా  కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఈ విషయంలో కేవలం మీడియా సంస్థలకే కాకుండా గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్స్,  గూగుల్,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ వేదికలపై ఉన్నఆ 12 వివాదాస్పద లింకులను,  పవన్ కల్యాణ్ పరువుకు భంగం కలిగించే అన్ని రకాల పోస్టులను, వీడియోలను తక్షణమే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ మధ్యంతర  ఉత్తర్వులు వచ్చే నెల 24 వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.