40ఏళ్లలో… 4,700రెట్లు… ఎలా ఎదిగింది?

 

రిలయన్స్ … ఈ పేరు ఓ కంపెనీది కాదు! రిలయన్స్ అంటే కోట్లాది భారతీయుల విశ్వాసానికి మారుపేరు! బిజినెస్ లెజెండ్ ధీరుభాయ్ అంబానీ తన సంస్థకి రిలయన్స్ అని ఎందుకు పేరు పెట్టారోగాని… ఇంగ్లీషులో దాన్ని విశ్వాసం అనే ఉద్దేశంతో కూడా వాడతారు! ఇప్పటికి నలభై ఏళ్ల కింద ఆయన ప్రారంభించిన రిలయన్స్ ఇవాళ్ల సాధించిన అత్యుత్తమ విజయం జనం విశ్వాసాన్ని చూరగొనటమే!

 

తమ సంస్థ నలభయ్యవ సర్వ సభ్య సమావేశంలో ప్రసగించిన ముఖేష్ అంబానీ చెప్పిన విశేషాలు వింటే రిలయన్స్ ఎంత ఉధృతంగా అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది! 1977లో కేవలం వస్త్రాలు అమ్మే బ్రాండ్ గా మొదలైన రిలయన్స్ ఇవాళ్ల జియో వరకూ ఎన్నో ఉత్పత్తుల్ని భారతీయులకి అందజేస్తూ సంచలనం సృష్టించింది. అయితే, ఇది ఏదో కేవలం బిజినెస్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అసవరం లేదు. రిలయన్స్… టాటా లాంటి అతి కొద్ది కంపెనీల సరసన చేరుతుంది. రిలయన్స్ ఎలాగైతే ఎదుగుతూ వచ్చిందో భారతదేశం కూడా అలా ప్రపంచ పటంలో మెరిసిపోతూ వచ్చింది. అందుకే, రిలయన్స్ సంస్థ భారతదేశ అభివృద్ధిలో అంతర్భాగం అనవచ్చు!

 

ముఖేష్ అంబానీ తమ సంస్థ విజయాలుగా చెప్పిన అబ్బురపరిచే విశేషాలు ఏంటంటే… 1977లో రిలయన్స్ లో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి షేర్ విలువ, ఇవాళ్ల, పదహారున్నర లక్షలు! అన్ని రెట్లు లాభాలు గడిస్తూ దూసుకొచ్చింది ఆ సంస్థ! ఇక 1977లో రిలయన్స్ ఆదాయం 70కోట్లు! ఇప్పడెంతో తెలుసా? 3.30లక్షల కోట్లు! అంటే… 4,700 రెట్లు ఆదాయం పెరిగిందన్నమాట! ఆదాయం లాగే లాభం కూడా… ఒకప్పుడు 3కోట్లుంటే ఇప్పుడు 30వేల కోట్లట!

 

రిలయన్స్ సంస్థకున్న ఒకప్పటి ఆస్తుల విలువెంతో తెలుసా? 33కోట్లు! మరిప్పుడు? 7లక్షల కోట్లు! అంటే… 20వేల రెట్లు పెరిగాయన్నమాట! ఇవన్నీ వ్యాపార లావాదేవీలు. సామాన్య జనానికి ఏంటి లాభం అంటారా? రిలయన్స్ అభివృద్ధి భారత్ అబివృద్ధి ఎలా అయిందంటారా? అయితే, రిలయన్స్ లో ఉద్యోగాలు చేస్తూ బతుకు బండి నెడుతోన్న వారి సంఖ్య తెలుసుకోవాల్సిందే! ఒకప్పుడు మూడున్నర వేల మందికి ఉపాధి కల్పించిన రిలయన్స్ ఇవాళ్ల రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తోంది! పరోక్షంగా దానిపై ఆధారపడ్డవారు, షేర్ హోల్డర్లు వంటి వారు ఇంకా బోలెడు మంది వుంటారు!

 

వ్యాపారం చేసే క్రమంలో కార్పోరేట్ బిజినెస్ మెన్ అనేక అక్రమాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతారన్నది నిజమే! రిలయన్స్ అధినేతలపై కూడా అలాంటి ఆరోపణలు వున్నాయి. అయినా కూడా 40ఏళ్ల ప్రస్థానంలో రిలయన్స్ దేశ అభివృద్ధికి చేసిన మేలు ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే! ఎందుకంటే రిలయన్స్ … ధీరుభాయ్ ప్రారంభించిన ఒక ఆర్దిక విప్లవం!