ఎర్రకోటపైకి వెళ్లిందెవరు ! రాజకీయ కుట్రేనంటున్న రైతు సంఘాలు 

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించింది. గణ తంత్ర దినోత్సవం రోజున జరిపిన కిసాన్ పరేడ్ 
దేశ రాజధానిలో బీభత్సానికి కారణమైంది. దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా కొందరు వ్యక్తులు ఏకంగా ఎర్రకోటలోకి చొరబడ్డారు. అత్యంత పటిష్ట భద్రతను చేధించుకుని ఎర్రకోటలోకి వెళ్లడమే కాదు..  ప్రతి ఏటా ప్రధానమంత్రి  జాతీయ జెండా ఎగరేసే చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరేశారు.  

 రైతుల పరేడ్ సందర్భంగా ఎర్రకోటలో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా  తీవ్ర సంచలనంగా మారాయి. అయితే ఎర్రకోటను మట్టడించింది తమ పని కాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.  దీని వెనక పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు ఉన్నట్లు  ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఎర్రకోట అల్లర్ల తర్వాత సిధు ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని భావిస్తున్న అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన వ్యవహారంలో సిధుకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబరులో, ఈ నెల 16న నోటీసులు పంపినా ఆయన విచారణకు రాలేదని తెలుస్తోంది. 

 పంజాబ్‌కు చెందిన దీప్‌ సిధు ప్రముఖ గాయకుడు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించారు. ముందు నుంచీ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు సిధు. రెండు రోజుల క్రితం మరోసారి హస్తినకు వచ్చారు. సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళల్లో పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు చెబుతున్నారు. తాజాగా మంగళవారం జరిగిన కిసాన్‌ పరేడ్‌లోనూ సిధు పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద రైతులు తమ జెండాతో పాటు సిక్కు జెండాలను ఎగరేసిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారని తెలుస్తోంది. దీంతో  ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సిధునే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని సంఘ విద్రోహశక్తులు చేరాయని స్పష్టం చేశారు. 

ఢిల్లీ అల్లర్లకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిధు గురించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. దీప్‌ సిధు సిక్కు కాదని తెలుస్తోంది. దీప్ సిధు గతంలో ప్రధాని మోడీతో దిగిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  సిధు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ  అభ్యర్థి, నటుడు సన్నీ దేవోల్‌ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మధ్య సొంత పార్టీ పెట్టే యోచనలో సిధు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పుడు ఢిల్లీ ఘటనల్లో సిధు పాత్రపై ఆధారాలు లభ్యం అవుతుండటంతో  ఎర్రకోట అల్లర్ల వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలకు బలం చేకురుతోంది. 
 
 సిధును తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ చెబుతున్నారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిధు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే ఢిల్లీ  అల్లర్ల నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను సిధు ఖండించారు. ఎర్రకోట ఘటన తర్వాత సోషల్‌మీడియాలో  ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా తాను ఎలా ప్రోత్సహించగలను.. ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు ఉన్న ఒక్క వీడియో కూడా లేదని అందులో సిధు తెలిపారు.