TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ కష్టాలు ఇన్నిన్ని కావయా...

Published on: Mon May 4, 2015 9:05PM



జగన్ గారి వైసీపీ అసలే కష్టాల కడలిలో కొట్టుకుపోతోంది. పార్టీ నాయకుడు జగన్ ఎప్పుడు అరెస్టు అవుతాడో అనే భయం అందరి గుండెల్ని గుబగుబలాడిస్తోంది. దీనికితోడు జగన్ గారి ఆస్తులన్నీ వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఇరుక్కుపోతున్నాయి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఎప్పుడెప్పుడు వైసీపీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నామధ్య జగన్ ప్రాజెక్టుల యాత్ర చేసిన సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు జగన్‌కి జలక్ ఇవ్వబోయారు. చివరికి జగన్ వాళ్ళని గడ్డం పట్టుకుని బతిమాలడంతో శాంతించారు. అయితే పేలడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతం తాత్కాలికంగా శాంతించినా, ఏదో ఒకరోజు భళ్ళున బద్దలవక మానదు. ఈ 40 మంది ఎమ్మెల్యేల విషయంలో జగన్‌కి ఆ భయం తప్పదు. ఈ కష్టాలు చాలవన్నట్టుగా వైసీపీకి మరో కొత్త కష్టం వచ్చిపడింది... అది.. ఎర్రచందనం దొంగలతో వైసీపీ ఎమ్మెల్యేలకు లింకులు వున్నట్టు ఆధారాలు లభించడమే.

ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీ కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనగారు లేటెస్ట్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఒక సినిమా కూడా తీసిన అతగాడు ఆ సినిమా హీరోయిన్‌ని మూడోపెళ్ళి చేసుకున్నాడు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో మస్తాన్ వలీ పాత్ర మాత్రమే కాకుండా స్థానికంగా వుండే ఛోటామోటా వైసీపీ నాయకుల హస్తం కూడా వున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎర్రచందనం బిగ్‌బాస్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇలా వుంటే, మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ నీతూ అగర్వాల్ పోలీసులకు దొరికిపోయే ముందు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, ఆమె పోలీసులకు లొంగిపోతానని అంటే వైసీపీ ఎమ్మెల్యేలు వద్దని వారించారని వచ్చిన వార్తలు పార్టీ గుండెలో రాయి పడేలా చేశాయి. అయితే పోలీసు వర్గాలు మాత్రం అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టలేదు. పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం సదరు ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. మరి వైసీపీ నాయకత్వం ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.