TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

Published on: Sat Jul 5, 2025 9:17PM

 

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు  ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరించిన మేరకు అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి  మండలం, రాయవరం గ్రామం, కావలిపల్లె అటవీ ప్రాంతంలో   అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని  అన్నమయ్య జిల్లా  జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుకు  పక్కా సమాచారం వచ్చింది .

ఎస్పీ ఆదేశాల మేరకు, రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్. కృష్ణమోహన్  ఆధ్వర్యంలో, రాయచోటి రూరల్ సీఐ ఎన్.వరప్రసాద్, టి.సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది మరియు టి.సుండుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి   కావలిపల్లె అటవీ ప్రాంతంలో కాపుకాశారన్నారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న    ఆండీ గోవిందన్ ను  శనివారం ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

*మరికొందరికోసం గాలింపు 

అరెస్ట్ చేసిన ఆండీ గోవిందన్ విచారణలో  తమిళనాడు రాష్ట్రంలోని మరి కొందరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు తప్పించుకుపోయినట్లు తెలిసిందనని అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.వారికోసం  గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అటవీ సంపదను, ముఖ్యంగా ఎర్రచందనాన్ని రక్షించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.

స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.