దొంగవేబిల్లులతో ఎర్రచందనం స్మగ్లింగు
Published on: Wed Jul 11, 2012 11:16AM
జొన్నల లోడుకు వేబిల్లు రాయించి ఎర్రచందనం స్మగ్లింగు చేస్తున్న తీరు నేరప్రపంచంలోనే ఓ వినూత్న పోకడగా భావించాలి. స్మగ్లింగు చేసే ముఠా ఏమో తమిళనాడుదైతే లారీ డ్రైవర్ మాత్రం పంజాబీ కావటం కూడా గమనార్హం. ఇంతకీ ఈ లోడు దొరకటానికి కారణం గంట క్రితమే చెకింగ్ అయ్యాక మళ్లీ చెకింగేమిటని లారీ డ్రైవర్ తనిఖీ చేయకుండా వేగంగా కదిలిపోవటమే. ఈ సమాధానమే ఒక చిత్రంగా ఉందని అనుమానించి వెంబడిస్తే లారీని ఇంకా వేగంగా డ్రైవర్ నడపటం, ఎస్సై దాన్ని వెంబడిస్తూనే తమ శాఖ ఉన్నతాథికార్ల ద్వారా సహాయం తీసుకోవటం, ఓ ఛేజింగ్ తరువాత ఆయన తన సిబ్బందితో లారీని ఆపటం ఓ మాస్‌చిత్రంలోని ఘటనలను కూడా తలపిస్తున్నాయి. ఈ ఘటనకు గుంటూరు జిల్లా వేదికైంది. ముందస్తుగా ఎర్రచందనం లోడు స్మగ్లింగు గుంటూరు జిల్లా మీదుగా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద ఇన్‌ఛార్జి ఎస్‌ఐ మల్లిఖార్జునరావు తన సిబ్బంది సాయంతో తనిఖీలు చేపట్టారు.
ఈ లోపు చెన్నయ్ నుంచి ఢల్లీకి వెళుతున్న లారీ ఒకదాన్ని ఆపమని సిబ్బందికి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ఆదేశాలిచ్చారు. వారు ఆపగానే డ్రైవర్ గంట క్రితమే చెక్ చేసి మళ్లీ చెకింగ్ అంటారేమిటని ఎదురు ప్రశ్నించి ఆపినట్లే ఆపి లారీని ముందుకు దూకించారు. దీంతో ఆ లారీ డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ఆపమని కోరుతూ వెనుకనే పోలీసులు ఛేజింగ్ మొదలుపెట్టారు. దీంతో లారీ డ్రైవర్ వేగాన్ని పెంచాడు. అకస్మాత్తుగా వేగం పెంచడం అనుమానం బలపడటానికి కారణమైంది. వెంటనే ఇన్‌ఛార్జి ఎస్‌ఐ, తమ సిఐ బిలాలుద్దీన్‌కు సమాచారం అందించారు. ఆయన కూడా రాజుపాలెం ఎస్‌ఐను ఎదురు పంపించారు. ఈలోపు లారీని ఛేజింగ్ చేసిన ఇన్‌ఛార్జి ఎస్‌ఐ లారీకి అడ్డంగా తమవాహనం ఉంచి డ్రైవర్ సర్వేందర్‌సింగ్, క్లీనర్‌ను వేబిల్లులు చూపమన్నారు. దానిలో జొన్నల లోడు వేబిల్లులున్నాయి. లారీలో పరిశీలిస్తే పైరెండు వరుసలు జొన్నలలోడు కింద ఎర్రచందనం దుంగలు దాదాపు కోటిరూపాయలకు పైబడినది కనపడ్డాయి. దీంతో డ్రైవర్, క్లీనర్‌లతో పాటు తమిళనాడుకు చెందిన కుదూర్, కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


