TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కన్నుమూత

Published on: Sun Sep 11, 2022 8:00AM

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన కృష్ణం రాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. 1966లో చిలకాగోరింక సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణంరాజు  మొత్తం183పై చిలుకు సినిమాలలో నటించారు.   5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు.

కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున ఏజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న   ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కృష్ణం రాజు తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన కృష్ణం రాజు ఆ తరువాత బీజేపీలో చేరి. కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో నరసాపురం నుంచి లోక్ సభకు ఎన్నికై వాజ్ పేయి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.

2004 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో పరాజయం పాలయ్యారు.   2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత నుంచి కృష్ణంరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ,  2014లో కృష్ణంరాజు మళ్లీ బీజేపీలో చేరారు.  

అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూఆజాత శత్రువుగా, మంచి మనిషిగా అందరి మన్ననలూ అందుకున్న కృష్ణం రాజు మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం(సెప్టెంబర్ 12) జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.