TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పంచన రెబల్ స్టార్ కృష్ణంరాజు?

Published on: Fri Apr 27, 2012 10:37AM

కేంద్ర రక్షణశాఖ మాజీ సహాయ మంత్రిగా రెండుసార్లు పనిచేసిన కృష్ణంరాజు త్వరలోనే వై.ఎస్. జగన్ గూటిలో చేరబోతున్నట్లు తెలిసింది. గతంలో భారతీయజనతాపార్టీ తరపున కాకినాడ, నర్సాపురం లోక్ సభ స్థానాలకు ఆయన ఎన్నికయ్యారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కోస్తాజిల్లాల్లో జగన్ కు ఉన్న ప్రజాదరణను గమనించిన కృష్ణంరాజు మరోకొడ్డి రోజుల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 

 

 

కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణంరాజు పార్టీలో చేరిన వెంటనే ఆయనకు ఉప ఎన్నికల ప్రచారబాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు వివాదాలకు అతీతంగా ఉంటారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పేరిట పలు విజయవంతమైన చిత్రాలు ఆయన నిర్మించారు. అయితే గ్రానైట్ వ్యాపారంలోకి దిగి కొంత నష్టపోయారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు.